Wednesday, October 9, 2024

Delhi | ఉచితంగా ఫోర్టిఫైడ్ రైస్… కేంద్ర కేబినెట్‌లో కీల‌క నిర్ణ‌యాలు..

ఢిల్లీలో ప్రధాని మోదీ సమక్షంలో కేంద్ర మంత్రివర్గం సమావేశమైంది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలకు కేంద్ర కేబినెట్ ఆమోద‌ ముద్ర వేసింది. ఇక నుంచి గరీబ్ కళ్యాణ్ అన్నయోజన, ఇతర సంక్షేమ పథకాల కింద ఫోర్టిఫైడ్ బియ్యాన్ని మాత్రమే పంపిణీ చేయాలని నిర్ణయించింది.

పోష‌కాహారంపై దృష్టి !

దేశవ్యాప్తంగా పోషకాహార లోపాన్ని పరిష్కరించడానికి ఒక ముఖ్యమైన చర్యగా, ఫోర్టిఫైడ్ బియ్యాన్ని సరఫరా చేయడానికి క్యాబినెట్ ఆమోదించింది. ఈ క్రమంలో గరీబ్ కళ్యాణ్ యోజన పథకాన్ని డిసెంబర్ 2028 వరకు పొడిగించారు.

- Advertisement -

అంటే అప్పటి వరకు పేదలకు ఉచితంగా ఫోర్టిఫైడ్ బియ్యాన్ని సరఫరా చేస్తారు. దేశంలో రక్తహీనత, సూక్ష్మ పోషకాల లోపాలను నివారించడానికి ప్రధాన మంత్రి పోషణ్ అనే పథకం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో అమలులో ఉంది. ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం రూ.17,082 కోట్లు కేటాయించనుంది.

నేషనల్ మారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ డెవ‌లప్‌మెంట్ !

ఇక‌, గుజరాత్‌లోని లోథాల్‌లో నేషనల్ మారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ (ఎన్‌ఎమ్‌హెచ్‌సీ) అభివృద్ధికి కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. ఈ ప్రాజెక్టును రెండు దశల్లో పూర్తి చేసేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఫేజ్ 1ఏకు రూ.1,238.05 కోట్లు… ఫేజ్ 1బీకి రూ.266.11 కోట్లు కేటాయించారు.

ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా 15,000, పరోక్షంగా 7,000 ఉద్యోగాలు వస్తాయని కేంద్ర కేబినెట్ అంచనా వేసింది. దాంతో పాటు స్థానిక కమ్యూనిటీలు, పర్యాటకులు, పరిశోధకులు, ప్రభుత్వ సంస్థలు, విద్యా సంస్థలు, సాంస్కృతిక సంస్థలు, పర్యావరణ సమూహాలు, వ్యాపారాలు ఈ ప్రాజెక్ట్ నుండి ప్రయోజనం పొందుతాయని భావిస్తున్నారు.

సరిహద్దు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి !

రాజస్థాన్-పంజాబ్‌లో సరిహద్దు మౌలిక సదుపాయాల అభివృద్ధి చేపట్టబడుతుంది. ఈ మేరకు సరిహద్దు ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి నిధులు కేటాయించారు. రాజస్థాన్-పంజాబ్ సరిహద్దు ప్రాంతాల్లో రూ.4,406 కోట్ల పెట్టుబడితో 2,280 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement