Tuesday, November 26, 2024

ఫార్ములా ఈ రేసింగ్‌కు సర్వంసిద్ధం..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: భాగ్యనగరం అంతర్జాతీయ ఫార్ములా ఈ రేసింగ్‌కు వేదికకానుంది. డిసెంబర్‌ లో ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌ పేరుతో ప్రాక్టీస్‌ చేసిన అనంతరం ఫార్ములా ఈ రేసింగ్‌ పోటీలకు వేదిక అయింది. శుక్రవారం నుంచి అసెంబ్లి సమావేశాలు ప్రారంభం, 17న నూతన సచివాలయం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇప్పటికే పటిష్టమైన ఏర్పాట్లను ప్రభుత్వం చేసింది. దీంతో పాటు 11,12 తేదీల్లో ఫార్ములా ఈ రేసింగ్‌ ఉండటంతో పటిష్టమైన బందోబస్తు మధ్య ఎన్టీఆర్‌ మార్గ్‌ ఉంది. ఫార్ములా ఈ రేసింగ్‌కు 21,000 వేలమంది వీక్షించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సందర్శకులకోసం ప్రత్యేకంగా 11 స్టాండ్లు, 7గేట్లను ఏర్పాటు చేస్తున్నారు. పార్కింగ్‌ కోసం 17 ప్రాంతాలను సిద్ధం చేశారు.

7వ తీదీనుంచి 12వతేదీవరకు ఎన్టీఆర్‌ మార్గ్‌ నుపూర్తిగా క్లోజ్‌ చేసి భద్రతసిబ్బంది ఆధీనంలోకి తీసుకోనుంది. ఫార్ములా ఈ రేసింగ్‌ కోసం ట్యాంక్‌ బండ్‌ పరిసరాల్లో 2.8 కిలోమీటర్ల ట్రాక్‌ నిర్మించారు. 18మలుపులతో ఉన్న ఈ ట్రాక్‌పై రేసింగ్‌ కార్లు దూసుకుపోనున్నాయి. ఇక ఈ రేస్‌లో 11జట్లు, 22మంది డ్రైవర్స్‌ పాల్గొననున్నారు. ప్రపంచంలోని ప్రధాన ప్రముఖ నగరాల నుంచి పోటీ చూసేందుకు వస్తున్న నేపథ్యంలో అనేక అంచెల భద్రత ఏర్పాటు చేశారు. పోలీసులు హెలీ క్యాప్టర్‌, డ్రోన్‌ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిసింది. టిక్కెట్లు ఆన్‌ లైన్‌ లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

- Advertisement -

ఫార్ములా ఈ రేసింగ్‌ 2014 లో మొదటిసారిగా బీజింగ్‌ లో ఒలింపిక్‌ పార్క్‌ లో నిర్వహించారు. అప్పటినుంచి ఫార్ములా ఈ గ్లోబల్‌ ఎంటర్‌ టైన్‌ మెంట్‌ బ్రాండ్‌ గాఎదిగింది. ఈ ఫార్ములా కార్లలో మోటర్‌ ఒక ట్రాన్స్‌ మిషన్‌ ఉంటాయి. బ్యాటరీ నుంచి తీసుకున్న ఎలక్ట్రిసిటీ ని ఇన్వర్టర్‌ డైరెక్ట్‌ కరెంట్‌ (డిసి) నుంచి ప్రత్యామ్నాయ కరెంట్‌ గా (ఎసి) మారుస్తుంది. ఈ విద్యుత్‌ మోటార్‌ చక్రాలను తిప్పుతుంది. ప్రస్తుతం ఈ కార్లు గంటకు 280 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణించగలవు. 250 కెవి పవర్‌ ద్వారా 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 2.8 సెకన్లలోనే అందుకుంటాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement