హైదరాబాద్: తెలంగాణ రాజధాని నగరం హైదరాబాద్‌లో నిర్వహించిన ఫార్ములా ఈ రేస్ వరల్డ్ చాంపియన్ షిప్ విజయవంతంగా ముగిసింది. నెక్లెస్ రోడ్ వేదికగా అట్టహాసంగా ప్రారంభమైన ప్రతిష్టాత్మక ఫార్ములా రేసింగ్ శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైంది. దాదాపు గంటన్నరపాటు సాగింది. జీన్ ఎరిక్ వెర్గ్‌నే విజేతగా నిలిచాడు. నిక్ క్యాసిటీ రెండవ స్థానంలోను, సెబాస్టియన్ బ్యూమి మూడవ స్థానంలోను నిలిచారు. గంటకు 322 కి.మీ. వేగంతో రేసర్లు దూసుకెళ్లారు. ఇప్పటికే రెండుసార్లు విజేతగా నిలిచిన జీన్ ఎరిక్, ఇప్పుడు మూడోసారి చాంపియన్‌గా అవతరించాడు.
2013లో ఫార్ములా-1 రేసు తర్వాత భారత్‌లో జరుగుతున్న తొలి ఈ ఫార్ములా రేసు ఇదే. మొత్తంగా ఫార్ములా ఈ రేసుకు ఆతిథ్యమిచ్చిన 27వ నగరంగా హైదరాబాద్ గుర్తింపు పొందింది. హుస్సేన్‌సాగర్ తీరంలో 2.8 కి.మీ. విస్తరణలో ప్రత్యేకంగా నిర్మించిన సర్క్యూట్‌పై మొత్తం 11 జట్లు, 22 మంది రేసర్లు పాల్గొనడం జరిగింది. రేస్‌లో భారత్ నుంచి మహీంద్ర రేసింగ్, టీ సీఎస్ జాగ్వార్ బరిలోకి దిగాయి. ఆధిపత్యం మాత్రం విదేశీ కంపెనీలు, రేసర్లదే.