ముంబై – మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి మిలింద్ దేవరా ఆదివారం నాడు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆయన తన ఎక్స్‌లో పేర్కొన్నారు.
ఇండియా కూటమి సీట్ల పంపకాల్లో అసంతృప్తికి గురైన మిలింద్ ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన పార్టీలో నేడు మిలింద్ దేవరా చేరనున్నారు. కాంగ్రెస్ అగ్రనేత నేత రాహుల్ గాంధీ ‘భారత్ జోడో న్యాయ యాత్ర’ ప్రారంభ వేళ మిలింద్ పార్టీని వీడటం ఎదురుదెబ్బే అని చెప్పాలి. కాగా, ‘ఈరోజుతో నా రాజకీయ ప్రయాణంలో ఓ ముఖ్యమైన అధ్యాయం ముగిసింది. కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశాను. పార్టీతో నా కుటుంబానికి ఉన్న 55 ఏళ్ల అనుబంధం ముగిసింది. ఇన్నేళ్లు నాకు అండగా నిలిచిన పార్టీ కార్యకర్తలు, నాయకులు, సహచరులకు ధన్యవాదాలు’ అని మిలింద్ దేవరా ట్వీట్ చేశారు.