Thursday, September 19, 2024

Delhi | కేసీఆర్‌ను ఓడించేందుకే పార్టీ మారా.. ఖర్గేతో భేటీ అనంతరం మాజీ ఎంపీ వివేక్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత కే. చంద్రశేఖర రావును ఓడించడం కోసమే తాను పార్టీ మారానని మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి అన్నారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి రాజీనామా చేసి రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన ఆయన గురువారం ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేను మర్యాదపూర్వకంగా కలిశారు.

వివేక్ తన సతీమణి సరోజ, కుమారుడు వంశీతో పాటు ఖర్గేను కలిశారు. అనంతరం అక్కడే మీడియాతో మాట్లాడుతూ.. అందరి సమిష్టి కృషితో తెలంగాణ వచ్చిందని, అయితే బంగారు తెలంగాణ అంటూ కేసీఆర్ అన్ని వ్యవస్థలను నాశనం చేశారని ఆరోపించారు. కుటుంబ పాలన, అవినీతి పాలనతో రాష్ట్రాన్ని కేసీఆర్ దోచుకున్నారని విమర్శించారు.

- Advertisement -

నాలుగేళ్లుగా కేసీఆర్ రాక్షస పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేశానని తెలిపారు కాళేశ్వరం బ్యాక్ వాటర్‌తో ప్రజలు ఇబ్బందులుపడ్డారని, కమిషన్ల కోసమే ప్రాజెక్టు రీడిజైన్ చేశారని ఆరోపించారు. కేసీఆర్‌ను ఓడించాలని నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. తనను కాంగ్రెస్‌లో చేరాల్సిందిగా రాహుల్ గాంధీ కోరారని, ఏఐసీసీ అధ్యక్షులుగా ఉన్న మల్లికార్జున ఖర్గే ఆశీస్సులు తీసుకున్నానని అన్నారు.

కాంగ్రెస్‌లో చేరి కేసీఆర్ రాక్షస పాలన నుంచి విముక్తి కల్పించేందుకు కృషి చేస్తానని అన్నారు. బీజేపీలో తాను చేరక ముందు పార్టీ పరిస్థితి ఎలా ఉందో, చేరిన తర్వాత ఎలా ఉందో ప్రజలకు తెలుసు అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం కేసీఆర్‌ను ఓడించడమే ఏకైక లక్ష్యంగా తాను పార్టీ మారానని చెప్పుకొచ్చారు. ఇక ఎన్నికల్లో పోటీపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటందని, అధిష్టానం నిర్ణయం మేరకు తాను నడచుకుంటానని తెలిపారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement