నాగర్ కర్నూల్ మాజీ ఎంపీ మందజగన్నాథం కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇటీవల ఆయన ఆరోగ్యం క్షీణించడంతో హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందాడు.
మంద జగన్నాథం రాజకీయ ప్రస్థానం !
నాగర్ కర్నూల్ ఎంపీగా మందజగన్నాథం నాలుగు సార్లు పని చేశారు. 1996లో తొలిసారిగా టీడీపీ తరపున నాగర్‌కర్నూల్ ఎంపీగా గెలుపొందారు. 1999, 2004 ఎన్నికల్లో తెలుగుదేశం టికెట్‌పై గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి 2009 ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు. 2014లో బీఆర్ఎస్ పార్టీలో చేరి.. ఆ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో ఆయనకు టిక్కెట్ దక్కలేదు. ఈ నేపథ్యంలో 2022 జూలై 1న ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా అప్పటి సీఎం కేసీఆర్ ఆయనను నియమించారు. 2023 నవంబర్ 17న ఆయన బీఆర్ఎస్ పార్టీని వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరాడు. అయితే నాగర్‌కర్నూల్ టికెట్ రాకపోవడంతో బీఎస్పీ తీర్థం పుచ్చుకున్నారు.