న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: హైదరాబాద్ నగరంలో నిర్మాణంలో ఉన్న ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనుల్లో జాప్యంపై ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. మంగళవారం ఢిల్లీలో ఆయన కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసి కారిడార్ పనుల్లో జాప్యం కారణంగా ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందుల గురించి వివరించారు.
రహదారి మరమ్మత్తు పనుల కోసం కేంద్రం నిధులు విడుదల చేసినా సరే రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. నిర్మాణ సంస్థ కారణంగానే ఈ ప్రాజెక్టులో జాప్యం జరుగుతోందని కూడా వివరించారు. రాష్ట్రం భూ సేకరణలో భవన యజమానులకు నష్టపరిహారాన్ని మూడు రకాలుగా చెల్లించిందని, ఒకే ప్రాజెక్టు పరిధిలో మూడు రకాల చెల్లింపులపై కేంద్ర మంత్రి ఆశ్చర్యం వ్యక్తం చేశారని తెలిపారు.
తెలంగాణలో అనేక చోట్ల కేంద్ర నిధులతో రహదారుల నిర్మాణం జరుగుతుంటే, ఈ ఉప్పల్ కారిడార్ ఒక్కటే రాష్ట్ర ప్రభుత్వ సహాయ నిరాకరణ కారణంగా జాప్యం జరుగుతోందని అన్నారు. జీహెచ్ఎంసీ అధికారులు సైతం పైప్ లైన్లు, ఎలక్ట్రిక్ స్తంభాలు మార్చకుండా జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. కేంద్ర మంత్రి గడ్కరీ వెంటనే నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా చీఫ్ ఇంజనీర్‌కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారని, యుద్ధ ప్రాతిపదికన పనులు జరిగే విధంగా చూడాలని ఆదేశాలు కూడా జారీ చేశారని చెప్పారు.