Tuesday, November 19, 2024

Delhi | నాకు సంబంధం ఉందని తేలితే ఇక్కడే ఉరి తీయండి.. వివేకా హత్య కేసుపై మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో తనకు ఇసుమంత సంబంధం ఉందని తేలినా తనను అక్కడికక్కడే ఉరి తీయవచ్చని మాజీ మంత్రి, భారతీయ జనతా పార్టీ నేత ఆదినారాయణ రెడ్డి సవాల్ విసిరారు. వినుడు వినుడు రామాయణ గాథ అన్న మాదిరిగా వివేక హత్య కేసుతో తనకు, డా. సునీతకు, బీటెక్ రవికి సంబంధం ఉందంటూ కొందరు పనిగట్టుకుని తప్పుడు కథనాలు రాస్తున్నారని ఆయన మండిపడ్డారు. సోమవారం సుప్రీంకోర్ట్ తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులను పక్కనపెడుతూ ఇచ్చిన తీర్పుతోనే హత్యతో ఎవరికి సంబంధం ఉందో స్పష్టంగా అర్థమవుతోందని ఆయన వ్యాఖ్యానించారు. వివేక హత్య తర్వాత సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)తోనే దర్యాప్తు జరిపించాలని తొలుత వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారని, అధికారంలోకి వచ్చిన సీబీఐ దర్యాప్తును తప్పుబడుతున్నారని ఆదినారాయణ రెడ్డి అన్నారు.

హత్య విషయం తెలిసిన తర్వాత తాను పరామర్శ కోసం మాత్రమే ఫోన్ చేశానని వివరించారు. వివేకను హతమార్చడానికి ఉపయోగించిన గొడ్డలికి అంటిన రక్తాన్ని ఎవరు కడిగారో, అసలు ఆ గొడ్డలిని ఎక్కడ కొన్నారో దర్యాప్తు సంస్థ సీబీఐకి తెలుసని, హత్యానంతరం ఆధారాలను చెరిపేసే క్రమంలో అక్కడున్న కుక్కను కూడా చంపేశారని, ఇంటి చుట్టూ రసాయనాలు జల్లారని ఆదినారాయణ రెడ్డి ఆరోపించారు. సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వద్దని వారిస్తున్నా సరే హత్య జరిగిన చోట ఉన్న రక్తపు మరకలు, ఇతర ఆధారాలను శుభ్రం చేసే నెపంతో చెరిపేశారని అన్నారు. పైగా ఇది తమ ఇంటి వ్యవహారం అంటూ పోలీసుల నోరుమూయించే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. గొడ్డలి పోట్లకు గుడ్డతో కట్లు కట్టి గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని దుయ్యబట్టారు.

అసంతృప్తితో మనిషి ఎప్పటికీ శాంతంగా ఉండలేడని, ప్రస్తుతం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కూడా అలాగే ఉందని ఆరోపించారు. జగన్ అబద్ధాలకు ఆనంద నిలయం అని ఆదినారాయణ రెడ్డి అన్నారు. తాను తప్పు చేశానని తేలితే ఉరి తీయడం లేదంటే ఎన్కౌంటర్ కూడా చేయవచ్చని, అందుకు తాను సిద్ధమేనని అన్నారు. నిజాలు మాట్లాడినవారిని భూమ్మీద లేకుండా చేస్తున్నారని, ఈ క్రమంలో తనను కూడా చంపవచ్చని ఆయన వ్యాఖ్యానించారు. ఇంట్లో భార్యకు, కుటుంబ సభ్యులకు తాను లేననుకుని బ్రతకాల్సిందిగా ఇప్పటికే చెప్పేశానని ఆదినారాయణ రెడ్డి అన్నారు. రాష్ట్రంలోనైనా, ఢిల్లీలోనైనా తనకేమీ సెక్యూరిటీ లేదని, తనను చంపినంత మాత్రాన ధర్మాన్ని చంపలేరని అన్నారు. నిజానికి ఈ హత్య వెనుక విస్తృత కుట్ర దాగుందని సర్వోన్నత న్యాయస్థానమే అభిప్రాయపడుతోందని అన్నారు. ఈ భారీ కుట్రలో అవినాశ్ రెడ్డి ఉన్నారని, సీబీఐ త్వరలో తప్పక అరెస్టు చేస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. అరెస్టు భయంతోనే అవినాశ్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ కోరుతున్నారని తెలిపారు. విస్తృత కుట్రలో అవినాశ్ రెడ్డిని దాటి ఇంకా మరికొందరు అత్యంత ప్రముఖుల పాత్ర కూడా ఉందని ఆదినారాయణ రెడ్డి తెలిపారు. సీబీఐ నిశ్శబ్దంగా వ్యవహరిస్తోందని, కీలక సమాచారాన్ని సేకరించి గోప్యంగా ఉంచిందని, అదను చూసి అన్నింటినీ బయటకు తీస్తుందని వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement