కాంగ్రెస్ సీనియర్ నేత, హిమాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న 87 ఏళ్ల వీరభద్ర సింగ్.. గురువారం తెల్లవారుజామున 3.40 గంటలకు సిమ్లాలోని ఇందిరా గాంధీ మెడికల్ కాలేజీలో తుదిశ్వాస విడిచారు. వీరభద్ర సింగ్ ఏప్రిల్ 13న కరోనా బారినపడ్డారు. అనంతరం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కాగా.. జూన్ 11న రెండోసారి కరోనా వచ్చింది. రెండు నెలల వ్యవధి రెండు స్లార్ కోవిడ్ బారిన పడడంతో ఆయన ఆరోగ్యం క్షిణించింది. సోమవారం(జులై 5) గుండెపోటు రావడంతో ఆయన పరిస్థితి విషమంగా ఉంది. బుధవారం వెంటిలేటర్‌లో ఉంచారు. గురువారం ఉదయం తుది శ్వాస విడిచారు.
వీరభద్ర సింగ్ 1934 జూన్ 23న రాజ కుటుంబంలో పుట్టారు. వీరభద్ర సింగ్ కాంగ్రెస్ తరపున తొమ్మిదిసార్లు ఎమ్మెల్యేగా, ఐదుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. హిమాచల్‌ప్రదేశ్‌కు ఆయన ఆరుసార్లు సీఎంగా సేవలందించారు. వీరభద్ర సింగ్ భార్య ప్రతిభా సింగ్ గతంలో మండి నియోజకవర్గం నుంచి లోకసభకు ప్రాతినిధ్యం వహించారు. వీరభద్ర సింగ్ కొడుకు విక్రమాధిత్య సింగ్ ప్రస్తుతం సిమ్లా ఎమ్మెల్యేగా ఉన్నారు. కాగా, వీరభద్ర సింగ్ మృతిపై కాంగ్రెస్ పార్టీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.
ఇది కూడా చదవండి: వైఎస్ఆర్ పై జగన్ భావోద్వేగ ట్వీట్