తెలంగాణలోని జనగామ జిల్లాలో ఓ రైతుకు లంకెబిందె దొరికింది. అందులో భారీగా బంగారు, వెండి ఆభరణాలు ఉన్నట్లు తెలుస్తోంది. పెంబర్తి వద్ద నర్సింహా అనే వ్యక్తి తనకు చెందిన 11 ఎకరాల భూమిని చదును చేస్తుండగా ఓ లంకెబిందె లభ్యమైంది. దీంతో ఆ రైతు లంకెబిందెను బయటకు తీశాడు. అనంతరం దాన్ని పగులగొట్టి చూడగా బంగారు ఆభరణాలు లభ్యమయ్యాయి. తక్షణమే ఆ రైతు అధికారులు, పోలీసులకు సమాచారం అందించారు. ఆ లంకెబిందెలో భారీగా బంగారం ఉంటుందని అంచనా వేస్తున్నారు.
రైతు నర్సింహా పొలంలో లంకె బిందె లభ్యమైందని తెలియగానే సమీప గ్రామాల ప్రజలు అక్కడికి భారీగా చేరుకుంటున్నారు. పోలీసులు, అధికారులు లంకెబిందెను సీజ్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. 18 తులాల బంగారు ఆభరణాలు, రెండు కిలోలకు పైగా వెండి ఆభరణాలు లభ్యమైనట్లు సమాచారం. ప్రస్తుతం స్వాధీనం చేసుకున్న బంగారాన్ని పరీక్షల నిమిత్తం పురావస్తు శాఖ అధికారులకు అప్పగిస్తామని పోలీసులు చెబుతున్నారు. బంగారం ఈ కాలంనాటిది.. లేదా పురాతన కాలానికి చెందినదా అన్న విషయాన్ని పురావస్తు శాఖ అధికారులు తేలుస్తారన్నారు. మరోవైపు లంకెబిందెలు దొరకడంతో ఆ సొమ్ముతో అమ్మవారి ఆలయాన్ని నిర్మించాలని పలువురు స్థానికులు కోరుతున్నారు.