రాష్ట్రీయ జనతాదళ్ వ్యవస్థాపకుడు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్ యాదవ్ ఆరోగ్యం మరింత విషమించింది. హృదయ, మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న ఆయన పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో రాంచీలోని రిమ్స్ నుంచి న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌కు మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో తరలించారు. అక్కడ చికిత్స పొందిన తరువాత తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో డిశ్చార్ చేశారు. అయితే కొద్దిసేపట్లోనే మళ్లిd ఆరోగ్యం క్షీణించడంతో బుధవారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో ఎయిమ్స్‌లోని ఎమర్జెన్సీ వార్డులో చేర్చారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం ఆందోళనకరంగానే ఉందని, ఇన్ఫెక్షన్ పెరుగుతోందని లాలూ తనయుడు తేజస్వీయాదవ్ బుధవారం చెప్పారు. ప్రధానంగా మూత్రపిండాల్లో ఇన్ఫెక్షన్ పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. రాంచీలో ఉండగా క్రియాటినిన్ స్థాయి 4.5గా ఉందని, న్యూఢిల్లీకి తీసుకువచ్చిన సమయంలో పరీక్షించినప్పుడు అది 5.1కి పెరిగిందని, మళ్లిd బుధవారం మధ్యాహ్నం వైద్యపరీక్షలు నిర్వహించినప్పుడు 5.9కు చేరిందని తేజస్వి వివరించారు. ఎమర్జెన్సీ వార్డులో ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారని చెప్పారు. పశుదాణా కుంభకోణానికి సంబంధించిన 5 కేసుల్లో నాలుగింటిలో దోషిగా శిక్షపడిన లాలూ 73 ఏళ్ల వయసులో మరోసారి అస్వస్థతకు గురైనారు. రూ.139 కోట్ల అవినీతి వ్యవహారంలో ఆయన దోషిగా తేలారు. 2017నుంచి జైలులోనే ఉన్నప్పటికీ అనారోగ్య కారణాల వల్ల అత్యధిక సమయం రాంచీలోని రిమ్స్‌లోనే ఉండాల్సి వస్తోంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement