Tuesday, November 26, 2024

Delhi | టీ-కాంగ్రెస్ ఎన్నికల కమిటీల ఏర్పాటు.. ఎవ‌రెవ‌రికి చాన్స్ ద‌క్కిందంటే!

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు ఎదుర్కోనున్న తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించిన పలు కమిటీలను ఏఐసీసీ ప్రకటించింది. వాటిలో మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ నేతృత్వంలో ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ ఏర్పాటు చేయగా సభ్యులుగా వంశీచంద్ రెడ్డి, ఇ. కొమురయ్య, జ్ఞానేశ్వర్ ముదిరాజ్, నామిడ్ల శ్రీనివాస్, జగన్‌లాల్ నాయక్, సుప్రభాత్ రావు, భరత్ చవాన్, ఫక్రుద్దీన్‌ను నియమించింది. తదుపరి 24 మందితో మేనిఫెస్టో కమిటీ, 10 మందితో ఏఐసీసీ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కమిటీ, 12 మందితో పబ్లిసిటీ కమిటీ, 14 మందితో చార్జిషీట్ కమిటీ, 9 మందితో కమ్యూనికేషన్ కమిటీ, 17 మందితో ట్రైనింగ్ కమిటీ, 13 మందితో స్ట్రేటజీ కమిటీని ఏర్పాటు చేసింది.

స్ట్రేటజీ కమిటీకి ప్రేమ్‌సాగర్ రావు‌ను ఛైర్మన్‌గా నియమించిన ఏఐసీసీ, సభ్యుల్లో పాల్వాయి స్రవంతి, కోమటిరెడ్డి వినయ్ రెడ్డి, కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి తదితరులకు చోటు కల్పించింది. ట్రైనింగ్ కమిటీకి మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ను ఛైర్మన్‌గా నియమిస్తూ.. మల్లాది పవన్‌కు కన్వీనర్ బాధ్యతలు అప్పగించింది. సభ్యుల్లో కోట నీలిమ, మమత నాగిరెడ్డి, సాగరిక రావు వంటి యువ మహిళా నేతలకు చోటు కల్పించింది.

కమ్యూనికేషన్ కమిటీకి జెట్టి కుసుమ కుమార్‌ను ఛైర్మన్‌గా, మదన్ మోహన్ రావును వైస్ చైర్మన్‌గా ఏఐసీసీ నియమించింది. సభ్యుల్లో కొప్పుల ప్రవీణ్, గాలి బాలాజి, అనిరుధ్ రెడ్డి తదితరులకు చోటు కల్పించింది. చార్జిషీట్ కమిటీకి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్‌కు చైర్మన్‌గా, రాములు నాయక్‌కు వైస్ చైర్మన్‌గా బాధ్యతలు అప్పగించిన ఏఐసీసీ, సభ్యుల్లో సిరిసిల్ల రాజయ్య, కోదండ రెడ్డి, జ్యోత్స్న రెడ్డి, బెల్లయ్య నాయక్, ప్రీతం నగరగారి తదితరులకు అవకాశం కల్పించింది. ఈ కమిటీకి ఎక్స్ అఫిషియో సభ్యులుగా టీపీసీసీ అధికార ప్రతినిధులు ఉంటారని ఏఐసీసీ స్పష్టం చేసింది.

- Advertisement -

మాజీ మంత్రి షబ్బీర్ అలీ నేతృత్వంలో పబ్లిసిటీ కమిటీని ప్రకటించిన ఏఐసీసీ, వైస్ చైర్మన్‌గా ఈ. అనిల్ కుమార్‌ను నియమించింది. సభ్యుల్లో గడ్డం వినోద్, సురేశ్ షెట్కార్, జి. అనిల్ కుమార్, సంగిశెట్టి జగదీశ్వర్ రావు తదితరులున్నారు. ఏఐసీసీ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కమిటీ చైర్మన్‌గా కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్‌ను నియమిస్తూ సభ్యులుగా ఎన్. పద్మావతి రెడ్డి, నేరెళ్ల శారద, రాపోలు జైప్రకాశ్, వేమిరెడ్డి శ్రీనివాస రెడ్డి తదితరులకు చోటు కల్పించింది.

అత్యధికంగా 21 మందితో ఏర్పాటు చేసిన మేనిఫెస్టో కమిటీకి చైర్మన్‌గా మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును నియమించిన ఏఐసీసీ, వైస్ చైర్మన్‌గా గడ్డం ప్రసాద్‌కు బాధ్యతలు అప్పగించింది. సభ్యుల్లో పొన్నాల లక్ష్మయ్య, దామోదర రాజనర్సింహ, బలరాం నాయక్, ఆర్. దామోదర్ రెడ్డి, జి. చిన్నారెడ్డి, సంభాని చంద్రశేఖర్, మర్రి ఆదిత్య రెడ్డి, ఎర్ర శేఖర్ తదితరులకు చోటు కల్పించింది. ఈ కమిటీల ద్వారా పార్టీలో సుదీర్ఘ కాలం నుంచి సేవలందిస్తున్న సీనియర్లతో పాటు కొత్తగా చేరినవారికి, యువనేతలకు కూడా ప్రాధాన్యత కల్పిస్తూ పాత-కొత్తల బ్యాలెన్స్ చేసినట్టయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement