Friday, November 22, 2024

ఓబీసీ పార్లమెంట్ కమిటీ ఏర్పాటు, ఓబీసీ నేతల సమావేశంలో నిర్ణయం.. పలు పార్టీలో ఓబీసీ ఎంపీలు, నేతలు హాజరు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: వెనుకబడిన తరగతులకు చెందిన ఎంపీలతో ఓబీసీ పార్లమెంట్ కమిటీ ఏర్పాటైంది. మంగళవారం ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో ఓబీసీ ఎంపీల ఫోరం కన్వీనర్, కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంత రావు ఏర్పాటు చేసిన ఓబీసీ నేతల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఓబీసీ సమస్యలపై పార్లమెంట్ ఉభయ సభల్లో గళమెత్తాలని, ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ సాధించాలని ముక్తకంఠంతో నినదించారు. ఈ సమావేశానికి భారత రాష్ట్ర సమితి పార్లమెంటరీ పార్టీ నేత కే. కేశవ రావు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు, బీసీ సంక్షేమ సంఘం వ్యవస్థాపక నేత ఆర్. కృష్ణయ్య, మరో ఎంపీ గోరంట్ల మాధవ్‌తోపాటు బీఎస్పీ ఎంపీ శ్యామ్‌సింగ్ యాదవ్, జేడీ(యూ) ఎంపీ గిరిధర్ యాదవ్, డీఎంకే ఎంపీ గిరిరాజన్ సహా పలువురు ఎంపీలు, నేతలు, మేథావులు హాజరయ్యారు.

దేశంలో కులాలవారిగా జనాభా లెక్కలు సేకరించి ఓబీసీల సంఖ్య తేల్చాలని డిమాండ్ చేశారు. తదనుగుణంగా ఓబీసీ రిజర్వేషన్లను 52 శాతానికి పెంచాలని అన్నారు. అలాగే ఓబీసీ రిజర్వేషన్లలో అమలు చేస్తున్న క్రీమీలేయర్‌ను పూర్తిగా తొలగించాలని నేతలు మాట్లాడారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సమయంలో మరోసారి ఓబీసీ నేతలు సమావేశమై కేంద్రంలో ఓబీసీ ప్రత్యేక మంత్రిత్వ శాఖ సాధన కోసం గట్టిగా డిమాండ్ చేయాలని నిర్ణయించారు. అనంతరం సమావేశాన్ని ఏర్పాటు చేసిన వీహెచ్ మీడియాతో మాట్లాడుతూ.. ఓబీసీ ఎంపీల ఫోరం తరఫున గత 11 ఏళ్లుగా పోరాటం చేస్తున్నామని చెప్పారు. ఐఐఎం, ఐఐటీ వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఓబీసీ రిజర్వేషన్లు అమలయ్యేలా చేయగలిగామని వీహెచ్ అన్నారు.

ఇప్పుడు తాజాగా ఓబీసీ పార్లమెంట్ కమిటీ కూడా ఏర్పాటైందని, ఎంపీలందరూ మద్ధతు తెలిపారని వీహెచ్ వెల్లడించారు. ఎన్డీయే-1 లో కేంద్ర హోంమంత్రిగా ఉన్న రాజ్‌నాథ్ సింగ్ క్రీమీలేయర్ ఎత్తేస్తామంటూ హామీ ఇచ్చారని గుర్తుచేశారు. అలాగే కుల గణనకు కూడా ఆయన సానుకూలత వ్యక్తం చేశారని అన్నారు. వాటిని తక్షణమే అమలు చేయాలని వీహెచ్ డిమాండ్ చేశారు. న్యాయవ్యవస్థలో కూడా రిజర్వేషన్లు అమలు చేయాలని అన్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement