న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీని ప్రకటించింది. దేశవ్యాప్తంగా లోక్‌సభ, వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఖరారు చేసే కీలక కమిటీ ఇది. మొత్తం 16 మంది సభ్యులతో ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ఈ కమిటీని ఏర్పాటు చేసినట్టు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత వ్యవహారాలు) కేసీ వేణుగోపాల్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 16 మందిలో నల్గొండ ఎంపీ, తెలంగాణ పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి చోటు లభించింది. గత 3 దశాబ్దాల్లో కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీలో తెలుగు నేతలకు చోటివ్వడం ఇదే తొలిసారి.
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీల్లో పలువురు తెలుగు నేతలకు అవకాశం కల్పించినప్పటికీ ఎలక్షన్ కమిటీలో మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరికీ ప్రాతినిధ్యం ఉండేది కాదు. భారతీయ వాయుసేనలో ఫైటర్ జెట్ పైలట్‌గా పనిచేసి 1994లో కాంగ్రెస్ పార్టీలో చేరిన ఉత్తమ్ కుమార్ రెడ్డి మొదటి నుంచి గాంధీ కుటుంబానికి విధేయుడిగా, విశ్వాసపాత్రుడిగా మెలిగారు. ఆయన పార్టీ వీడుతున్నారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై మనస్తాపం చెందారు.
ప్రత్యర్థి పార్టీల నుంచి కాకుండా సొంత పార్టీలో నేతలే ఈ తరహా దుష్ప్రచారానికి పాల్పడుతున్నారని ఆయన పలు సందర్భాల్లో ఆవేదన వ్యక్తం చేశారు. సీఈసీ సభ్యుడిగా నియమించడంపై స్పందిస్తూ.. ఇలాంటి ప్రచారాల ద్వారా తనను పార్టీకి దూరం చేసే కుట్రకు పాల్పడినప్పటికీ గాంధీ కుటుంబం మాత్రం తనపై విశ్వాసం ఉంచిందని అన్నారు. ఇప్పటికే తెలంగాణ పీసీసీ స్థాయిలో స్క్రీనింగ్ కమిటీలో సభ్యుడిగా ఉన్న ఆయన, జాతీయ స్థాయిలో ఎలక్షన్ కమిటీలో సభ్యుడిగా చోటు లభించడంతో తెలంగాణ నుంచి కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికలో కీలకంగా మారనున్నారు.
కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ
1. మల్లికార్జున్ ఖర్గే
2. సోనియా గాంధీ
3. రాహుల్ గాంధీ
4. అంబికా సోని
5. అధిర్ రంజన్ చౌదరి
6. సల్మాన్ ఖుర్షీద్
7. మధుసూదన్ మిస్త్రీ
8. ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి
9. టీఎస్ సింగ్ దేవ్
10. కేజే జియోగ్రే
11. ప్రీతమ్ సింగ్
12. మహ్మద్ జావేద్
13. అమీ యాజ్ఞిక్
14. పిఎల్ పునియా
15. ఓంకార్ మార్కం
16. కేసీ వేణుగోపాల్