న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: దేశంలో ఒకేసారి గ్రామ సర్పంచ్ నుంచి పార్లమెంట్ సభ్యుడి వరకు ఎన్నికలు జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. ఇందుకోసం మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం, శనివారం కమిటీ సభ్యుల పేర్లను ప్రకటిస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. కమిటీని హై-లెవెల్ కమిటీగా వ్యవహరిస్తూ.. 7 అంశాలపై లోతుగా అధ్యయనం చేసి సిఫార్సులు చేయాల్సిందిగా పేర్కొంది. కేంద్ర న్యాయశాఖ విడుదల చేసిన గెజిట్ ప్రకారం కమిటీ వివరాలు…
రామ్‌నాథ్ కోవింద్ ఛైర్మన్
(మాజీ రాష్ట్రపతి)
అమిత్ షా సభ్యులు
(కేంద్ర హోంమంత్రి)
అధిర్ రంజన్ చౌదరి సభ్యులు
(లోక్‌సభలో ప్రతిపక్షంలో పెద్ద పార్టీ నేత)
గులాం నబీ ఆజాద్ సభ్యులు
(రాజ్యసభలో మాజీ ప్రతిపక్ష నేత)
ఎన్.కే. సింగ్ సభ్యులు
(15వ ఆర్థిక సంఘం మాజీ చైర్మన్)
డా. సుభాష్ సి. కశ్యప్ సభ్యులు
(లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్)
హరీశ్ సాల్వే సభ్యులు
(సీనియర్ న్యాయవాది)
సంజయ్ కొఠారి సభ్యులు
(మాజీ చీఫ్ విజిలెన్స్ కమిషనర్)
కమిటీలో సభ్యులతో పాటు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్ ప్రత్యేక ఆహ్వానితులుగా ఉంటారని గెజిట్‌లో పేర్కొంది. హైలెవెల్ కమిటీకి సెక్రటరీగా న్యాయశాఖ కార్యదర్శి నితేన్ చంద్ర వ్యవహరిస్తారని అన్నారు.
హై-లెవెల్ కమిటీ నిబంధనలు – లక్ష్యాలు:
a) లోక్‌సభ, అన్ని రాష్ట్రాల అసెంబ్లీలు, మున్సిపాలిటీలు, పంచాయితీలకు కలిపి ఒకేసారి ఎన్నికల నిర్వహణ కోసం ప్రజా ప్రాతినిథ్య చట్టం 1950తో పాటు రాజ్యాంగ పరిధిలో సాధ్యాసాధ్యాలను పరిశీలించి.. అందుకు అవసరమైన రాజ్యాంగ సవరణలను సూచిస్తూ సిఫార్సులు చేయాలి.
b) రాజ్యాంగ సవరణలకు రాష్ట్రాల నుంచి కూడా సమ్మతి అవసరమా.. లేదా అన్నది అధ్యయనం చేయాలి
c) హంగ్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు లేదా ప్రభుత్వం అవిశ్వాస తీర్మానంలో ఓడిపోవడం, పార్టీ ఫిరాయింపులతో ప్రభుత్వం పడిపోయిన సందర్భాల్లో జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసి సిఫార్సులు చేయాలి
d) ఒకే విడతలో జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యం కానప్పుడు.. ప్రభుత్వాల కాలవ్యవధి సంబంధిత అంశాలపై రాజ్యాంగ సవరణలను సూచించాలి
e) భవిష్యత్తులోనూ జమిలి ఎన్నికల చక్రం కొనసాగించడం కోసం తీసుకోవాల్సిన చర్యలను సూచిస్తూ సిఫార్సులు చేయాలి
f) జమిలి ఎన్నికల కోసం అవసరమైన పోలింగ్ సిబ్బంది, భద్రతా సిబ్బంది, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు – వీవీప్యాట్ యంత్రాల లభ్యత గురించి కూడా కమిటీ అధ్యయనం చేసి సిఫార్సులు చేయాలి
g) అన్ని ఎన్నికలకు ఒకే ఓటర్ల జాబితా, ఓటర్ ఐడీ కార్డుల వినియోగానికి సంబంధించి నిబంధనల రూపకల్పనపై అధ్యయనం చేసి సిఫార్సులు చేయాలి
వీటితో పాటు హైలెవెల్ కమిటీ తక్షణమే పని ప్రారంభించి వీలైనంత త్వరగా సిఫార్సులను ప్రభుత్వానికి అందజేయాలని గెజిట్‌లో ప్రభుత్వం పేర్కొంది. అలాగే కమిటీ హెడ్‌క్వార్టర్స్‌గా న్యూఢిల్లీ ఉంటుందని వెల్లడించింది. సమావేశాల నిర్వహణ, ఇతర కార్యక్రమాలకు సంబంధించి విధివిధానాలను కమిటీయే స్వయంగా ఏర్పాటు చేసుకుంటుందని పేర్కొంది. దీంతో పాటు కమిటీ నిర్వహణ, అలవెన్సులకు సంబంధించిన అంశాలపై కూడా గెజిట్‌లో స్పష్టతనిచ్చింది.
కమిటీ కార్యాకలాపాల నిర్వహణ కోసం కేంద్ర న్యాయశాఖ తగిన సదుపాయాలు కల్పించడంతో పాటు అవసరమైన సహాయం అందజేయాలని కేంద్రం స్పష్టం చేసింది. బడ్జెటేతర కేటాయింపుల నుంచి ఈ కమిటీ నిర్వహణ ఖర్చులకు తగిన నిధులను అందించాలని కూడా వెల్లడించింది.