న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: దేశ రాజధాని న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మంద జగన్నాధం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించారు. అనంతరం ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధులు మంద జగన్నాధ్, కె. ఎం.సాహ్ని, తెలంగాణ భవన్ రెసిడెంట్ కమీషనర్ డా. గౌరవ్ ఉప్పల్, తెలంగాణ భవన్ ఓఎస్డీ సంజయ్ జాజులతో కలిసి తెలంగాణ తల్లి విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. అక్కడే ఉన్న తెలంగాణ అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. అలాగే రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ విగ్రహానికి కూడా పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ఢిల్లీలోని ఫ్రాన్స్ ఎంబసీ ప్రతినిధి లారెంట్ ట్రిపోనే విశిష్ట అతిధిగా విచ్చేసారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మంద జగన్నాథం ప్రసంగిస్తూ.. పోరాటాలు, త్యాగాలతో ప్రజాస్వామ్య పంథాలో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో పదేళ్లకు చేరుకున్న ప్రగతి ప్రస్థానాన్ని తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా అమరుల త్యాగాలు స్మరిస్తూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఘనంగా జరపాలని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు సూచించారని చెప్పారు. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో జూన్ 2 నుంచి 22 వ తేది వరకు మూడు వారాల పాటు సాగే ఈ ఉత్సవాలు తెలంగాణ ఘనకీర్తిని చాటి చెప్పేలా పండుగ వాతావరణంలో జరపాలని నిర్ణయించారు. 21 రోజుల పాటు ప్రతి రోజు ఓ రంగానికి ప్రాధాన్యం కల్పించామని చెప్పారు. అమరవీరులకు ఘన నివాళులతో ప్రారంభమయ్యే దశాబ్ది ఉత్సవాలు అమరుల స్మృతి చిహ్నం ప్రారంభంతో ముగియనున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో కూడా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను 21రోజుల పాటూ ఘనంగా నిర్వహిస్తామని మంద జగన్నాథం అన్నారు.
తెలంగాణ రాష్ట్రం తొమ్మిదేళ్ల స్వల్ప కాలంలోనే అత్యంత ప్రగతిశీల రాష్ట్రంగా రూపుదిద్దుకుందని అన్నారు. ప్రజా సంక్షేమంలో, అభివృద్ధిలో యావత్ దేశానికి ఆదర్శప్రాయంగా నిలిచిందన్నారు. “తెలంగాణ ఆచరిస్తుంది – దేశం అనుసరిస్తుంది” అని చెప్పుకునే స్థాయికి చేరుకుందని ప్రశంసించారు. ఇది రాష్ట్ర ప్రజలందరికీ గర్వకారణమని, మానవీయమైన దృక్పథం, నిర్మాణాత్మకమైన ఆలోచన, దార్శనికమైన ప్రణాళిక రచన, పారదర్శకమైన పరిపాలన, వీటన్నిటి మేలు కలయిక అయిన “తెలంగాణ మోడల్” నేడు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మన్ననలు పొందుతుందని వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉండేదని గుర్తుచేశారు. రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ పటిష్టమైన ఆర్థిక క్రమశిక్షణతో, పటిష్టమైన కార్యాచరణ చేపట్టడం వల్ల జిఎస్డీపీ క్రమేణా పెరుగుతూ వచ్చిందన్నారు. ప్రభుత్వ ఆదాయాన్ని అత్యధికంగా పెట్టుబడి వ్యయానికి వినియోగించటం, అభివృద్ధికి సంక్షేమానికి సమ ప్రాధాన్యమివ్వడంతో సమ్మిళిత అభివృద్ధి సాకారమవుతున్నదని విశ్లేషించారు. ఈ అభివృద్ధి మోడల్ గురించి ఊరూవాడ, ప్రతీ రాష్ట్రంలోనూ విశేషంగా చర్చించుకుంటున్నారని తెలిపారు.
నాటి నుండి 10వ వసంతంలోకి అడుగిడే వరకు అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా దేశమే అచ్చెరువొందే రీతిలో పలు పథకాలను అమలు చేస్తూ కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ సంక్షేమ రంగంలో స్వర్ణయుగాన్ని లిఖించిందని కొనియాడారు. కళ్యాణ లక్ష్మి (షాదీ ముబారక్), రైతుబంధు, రైతు బీమా, వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు, కేసీఆర్ కిట్, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్, బర్రెల పంపిణీ, గొర్రెల పంపిణీ, చేప పిల్లల పంపిణీ, ఆత్మగౌరవ భవనాలు, ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు, సెలూన్లకు ఉచిత విద్యుత్ సరఫరా, గిరిజన తండాలకు గ్రామ పంచాయతీ హోదా, గురుకులాలు, ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీలు, బ్రాహ్మణులకు ఉన్నత విద్యార్జనకై ఓవర్సీస్ స్కాలర్ షిప్ లు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి ప్రతిష్టాత్మక పథకాలతో ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పే లక్ష్యంగా ప్రభుత్వం ఎన్నో పథకాలను విజయవంతంగా అమలు చేస్తూ ముందుకు సాగుతున్నది. తెలంగాణ మోడల్ గా నిలిచిన తెలంగాణ ఆచరిస్తున్న పలు కార్యక్రమాలను, పథకాలను, దేశంలోని అనేక రాష్ట్రాలతో పాటు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తోందని అన్నారు.
అనంతరం అతిధులందరూ కలిసి భవన్ ప్రాంగణంలో రాష్ట్ర ప్రగతిపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను ప్రారంభించారు. అలాగే హెల్త్ క్యాంపును, వివిధ ప్రభుత్వ శాఖల వారు ఏర్పాటు చేసిన స్టాళ్లను కూడా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీలోని తెలంగాణ ప్రజలు, తెలంగాణ భవన్ అధికారులు, ఉద్యోగులు ఈ పాల్గొన్నారు.