మంగపేట, (ప్రభ న్యూస్) : పారిశుధ్య నిర్వహణ, గ్రీనరీ పెంపు లక్ష్యాలుగా స్వచ్చదనం – పచ్చదనం కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినట్లు రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ (సీతక్క) అన్నారు.
స్వచ్చదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా సోమవారం ములుగు జిల్లా మంగపేట మండలంలోని కమలాపురం జడ్పీ పాఠశాలలో జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.ఏటూరునాగారం ఏఎస్పి శివం ఉపాద్యాయలతో కలసి మంత్రి సీతక్క మొక్కలను నాటారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ…. వన సంరక్షణతోనే మానవత్వం రక్షణ ఉంటుందని, పర్యావరణం కలుషితం కాకుండా ప్రతి ఒక్కరు మొక్కలను నాటి అడవులను కాపాడుకోవాలని అన్నారు. స్వచ్ఛదనం కార్యక్రమంతో పాటు గ్రామాలలో చెట్లను పెంచి పచ్చగా ఉంచుకోవాలని, అడవులతోనే మానవ మనుగడ ముడిపడి ఉందని అన్నారు.
స్వచ్చదనం – పచ్చదనం కార్యక్రమంపై వ్యాస రచన, ఉపన్యాస పోటీలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను శాలువాలతో సత్కరించి, సరిఫికేట్స్, మెమోంటోలు మంత్రి సీతక్క అందచేశారు.
మంగపేట మండలంలోని 18 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి , షాది ముభారక్ చెక్కులను మంత్రి సీతక్క అందచేశారు. అనంతరం రాజుపేటలో 16 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన ఆరోగ్య సబ్ సెంటర్ భవనంను మంత్రి ప్రారంభోత్సవం చేశారు.