ఆంధ్రప్రభ స్మార్ట్ హైదరాబాద్ : రాష్ట్రానికి కొత్త పెట్టుబడులను ఆకర్షించడం కోసం ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటనకు బయల్దేరారు. ఈ ఉదయం శంషాబాద్ నుంచి ఆయన అమెరికా వెళ్లారు.
ఆయన వెంట మంత్రి డి.శ్రీధర్‌బాబు, సీఎస్ శాంతికుమారి కూడా ఉన్నారు. న్యూజెర్సీ, వాషింగ్టన్ డీసీ, న్యూయార్క్, శాన్‌ఫ్రాన్సిస్కోతో పాటు దక్షిణ కొరియా సియోల్ నగరంలోనూ రేవంత్ బృందం పర్యటించనుంది.
తన పర్యటనలో భాగంగా.. తొలుత ఈనెల 4న న్యూజెర్సీలో జరిగే ప్రవాస తెలంగాణీయులతో జరిగే సమావేశంలో ఈ బృందం పాల్గొంటుంది. 5, 6 తేదీల్లో న్యూయార్క్‌లో వ్యాపార, వాణిజ్య సంస్థల ప్రతినిధులతో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలపై చర్చిస్తారు.
6న పెప్సికో, హెచ్‌సీఏ కంప్యూటర్స్ ప్రతినిధులతో భేటీ అవుతారు. మధ్యాహ్నం వాషింగ్టన్ డీసీకి చేరుకుని అక్కడ ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులతో సమావేశం కానున్నారు. 7న డల్లాస్‌లో వ్యాపార సంస్థల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించనున్నారు. అదే రోజు అక్కడ గాంధీ స్మృతి కేంద్రాన్ని సందర్శిస్తారు.
8న శాన్ఫ్రాన్సిస్కోలో యాపిల్ ఉత్పాదక బృందం, ట్రైనెట్ సీఈఓ, ఇతర వ్యాపార సంస్థల ప్రతినిధులతో భేటీ అయి చర్చించనున్నారు.
9న గూగుల్, అమెజాన్ తదితర సంస్థల ప్రతినిధులతో సమావేశం అవుతారు. శాన్ఫ్రాన్సిస్కోలో సాయంత్రం జరిగే ప్రవాస తెలంగాణీయుల భేటీలో పాల్గొంటారు.
అటు నుంచే సియోల్‌కు..10న శాన్ఫ్రాన్సిస్కో నుంచి బయల్దేరి 11న దక్షిణ కొరియా రాజధాని సియోల్‌కు చేరుకుంటారు. 12, 13 తేదీల్లో ఎల్జీ, శామ్సంగ్తో పాటు .. ఇతర వ్యాపార సంస్థల ప్రతినిధులతో భేటీ అయి పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చర్చించనున్నారు. 13న రాత్రి 11.50 గంటలకు సియోల్ నుంచి బయల్దేరి 14న ఉదయం 10.50 గంటలకు హైదరాబాద్‌కు చేరుకుంటారు.