Saturday, November 23, 2024

ఆతిథ్య రంగంలో విదేశీ పెట్టుబడులు.. ఎస్‌ఏటీటీఈ మార్ట్‌లో కిషన్‌రెడ్డి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : భారతదేశంలో పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలతో పాటు ఆతిథ్య రంగంలో వంద శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నట్లు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఉపాధి కల్పన, స్థానిక సముదాయాల ఆర్థిక సాధికారత విషయంలో పర్యాటక రంగం పోషించే పాత్రను గుర్తెరిగి దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు అన్నిరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు. ఇందుకోసం కరోనాంతర పరిస్థితుల్లో పర్యాటక రంగానికి పునర్వైభవం కల్పించే దిశగా దక్షిణాసియా దేశాలన్నీ సంయుక్తంగా కృషిచేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. గురువారం గ్రేటర్ నోయిడాలో ‘సౌత్ ఏషియా ట్రావెల్ అండ్ టూరిజం ఎక్స్‌ఛేంజ్ మార్ట్‌ను కేంద్రమంత్రి ప్రారంభించారు.

భారత పర్యాటకాన్ని కొత్త పుంతలు తొక్కించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న వివిధ కార్యక్రమాలు, స్థానిక సముదాయాల ఆర్థిక స్థిరత్వం, ఉపాధికల్పన కేంద్రంగా రూపుదిద్దుకున్న నూతన పర్యాటక విధానం ముసాయిదా, వివిధ మంత్రిత్వ శాఖల మధ్య సంపూర్ణ సమన్వయం, ‘ఇన్‌క్రెడిబుల్ ఇండియా’, ‘విజిట్ ఇండియా 2023’ తదితర అంశాల గురించి వివరించారు. ఈ ఏడాది జీ20తో పాటు షాంఘై సహకార సంఘం టూరిజం మార్ట్‌ను భారత ప్రభుత్వం నిర్వహించనుందని, మార్చి 13 నుంచి 17 వరకు వారణాసిలో ఎస్‌సీఓ పర్యాటక మంత్రుల సదస్సును నిర్వహించబోతున్నామని ఆయన పేర్కొన్నారు.

దీంతో పాటు ఏప్రిల్ 13 నుంచి 19 వరకు ముంబైలో ఎస్‌సీఓ ఫుడ్ ఫెస్టివల్ కూడా నిర్వహించనున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో మారిషస్ ఉప ప్రధాని, పర్యాటక మంత్రి  లూయిస్ స్టీవెన్ ఒబెగాడూ, మాల్దీవులు, మలేషియా, ఇండొనేషియా దేశాల పర్యాటక మంత్రులు, సౌదీ టూరిజం అథారిటీ సీఎంవో, అల్ హసన్ అలీతో పాటు పర్యాటక, ఆతిథ్య రంగాలకు సంబంధించి దక్షిణాసియా, ఎస్‌సీఓ దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement