న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : తెలంగాణలోని జహీరాబాద్‌లో ప్రాంతంలో నిమ్జ్ ( నేషనల్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ) ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం బలవంతపు భూసేకరణను ఆపాలని, లేదంటే రైతుల హక్కులను కాపాడడానికి ఉద్యమానికి సిద్ధమని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరామ్ హెచ్చరించారు. భూనిర్వాసితుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆశప్ప, రాఘవరెడ్డిలతో కలిసి ఢిల్లీ వచ్చిన ఆయన గురువారం కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌ను కలిసి పరిశ్రమల ఏర్పాటు పేరుతో తెలంగాణలో జరుగుతున్న భూదోపిడీపై ఫిర్యాదు చేశారు. అనంతరం కోదండరామ్ తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ… సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో జరుగుతున్న అడ్డగోలు భూసేకరణ గురించి కేంద్రమంత్రికి వివరించామని అన్నారు. ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుని, రైతులకు న్యాయం జరిగేలా నిర్ణయం తీసుకుంటామని భూపేంద్ర యాదవ్ హామీ ఇచ్చారని వెల్లడించారు.
హైదరాబాద్‌కు 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న జహీరాబాద్ ప్రాంతంలో నిమ్జ్ ఏర్పాటు పేరుతో తెలంగాణా సర్కార్ భూసేకరణకు తెర లేపిందని తెలిపారు. 22 గ్రామాల పరిధిలో 12,600 ఎకరాల భూమిని సేకరిస్తుండడం వల్ల 6,500 రైతు కుటుంబాలు వీధిన పడతాయని కోదండరామ్ ఆవేదన వ్యక్తం చేశారు. కోట్ల విలువైన భూములను నామమాత్రపు ధరకు లాక్కునే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. చిరుధాన్యాలకు నిలయమైన సస్యశ్యామల ప్రాంతంలో పరిశ్రమలు స్థాపిస్తే పక్కనే హైదరాబాద్ మరింత కాలుష్యం బారినపడే ప్రమాదముందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రియల్ ఎస్టేట్ సంస్థ కాదని, ప్రజా సంక్షేమాన్ని చూస్తే వ్యవస్థ అని గతంలో తీసుకొచ్చిన జీవోను హైకోర్టు కొట్టివేసినా రాష్ట్ర ప్రభుత్వ తీరు మారలేదని విమర్శించారు. 12,600 ఎకరాల్లో 4,500 ఎకరాలు మాత్రమే పరిశ్రమలకు వాడతారని, మిగిలిన భూమిని రిక్రియేషన్ పార్కుల కోసమని చెప్తున్నారని, పార్కుల కోసం రైతులు ఆధారపడి బతుకుతున్న వ్యవసాయ భూములను లాక్కోవడం ఎంతవరకు సబబని కోదండరామ్ ప్రశ్నించారు. అవన్నీ సాగుకు పనికి రాని పడావ్ భూములంటూ తెలంగాణ సర్కార్ కేంద్రానికి తప్పుడు సమాచారమిచ్చి అనుతుల కోసం ప్రయత్నిస్తోందని వివరించారు. అందులో 90 శాతం వ్యవసాయ భూములని, సాగుకు పనికిరాని భూములనే పరిశ్రమల కోసం సేకరించాలనే నిబంధనలున్నా వాటిని ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఆయన వాపోయారు. పరిశ్రమలు పెట్టడానికి అవసరమైన 4,500 ఎకరాల భూమి ఇప్పటికే ప్రభుత్వ ఆధీనంలో ఉందని, కొత్తగా భూసేకరణ అవసరం లేదని చెప్పుకొచ్చారు. ఈ విషయంపై కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖలు లేఖలు రాస్తామని, జాతీయ మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేస్తామని కోదండరామ్ తెలిపారు. రైతుల దగ్గర నుంచి తీసుకున్న భూమిని తక్కువ ధరకే పారిశ్రామికవేత్తలకు కట్టబెడతారని, వారు లాభపడడానికి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అవకాశమిస్తోందని ఆయన ఆరోపించారు. ఇప్పటికే రాష్ట్రంలో పలుచోట్ల పరిశ్రమల పేరుతో సేకరించిన భూములు రాజకీయ నాయకుల హస్తగతమయ్యాయని ఆయన మండిపడ్డారు. సహకార సంఘాలు ఏర్పాటు చేసి పేద రైతులకు న్యాయం చేయాలన్న అంబేద్కర్ ఆశయాలకు వ్యతిరేకంగా పేదల భూములను లాక్కుని సంపన్నుల చేతుల్లో పెడుతున్నారని ప్రొఫెసర్ కోదండరామ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రైతులను వేధించి బలవంతంగా భూసేకరణ చేయడాన్ని ఆపకపోతే మళ్లీ ఢిల్లీ వచ్చి కేంద్రమంత్రులను కలిసి తమ వంతు ప్రయత్నాలు కొనసాగిస్తామన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..