ఫోర్బ్స్ ఇండియా డిజిటల్ స్టార్ జాబితాలో తెలంగాణ కుర్రాడికి ప్లేస్ దక్కింది. ఫోర్బ్స్ ఇండియా-గ్రూప్ ఎం-ఐఎన్సీఏ సంయుక్తంగా భారత టాప్-100 డిజిటల్ స్టార్స్ జాబితాను విడుదల చేశాయి. ఇందులో గోదావరిఖనికి చెందిన సయ్యద్ హఫీజ్‌కు 32వ స్థానం లభించింది. డిజిటల్ స్టార్స్ ఎంపిక కోసం యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో హాస్యం, అందం, ఫ్యాషన్, వ్యాపారం-ఆర్థికం, ఫిట్నెస్, ఫుడ్, టెక్, ట్రావెల్, సామాజిక సేవ కేటగిరీల్లో ఎక్కువమంది ఫాలోవర్లు ఉన్న వారిని దీనికి ఎంపిక చేశారు. ఈ జాబితాలో గోదావరిఖని, యైటింక్లైన్ కాలనీకి చెందిన సయ్యద్ హఫీజ్‌కు 32వ స్థానం లభించింది.
ఇదే కాలనీలో హఫీజ్ కంప్యూటర్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. 2011లో తెలుగు ‘టెక్‌ట్యూట్స్’ పేరుతో యూట్యూబ్ చానల్ ప్రారంభించాడు. ఈ చానల్ ద్వారా కంప్యూటర్ కోర్సులు, మొబైల్ టెక్నాలజీ, ఫేస్బుక్, వాట్సాప్, టెలిగ్రామ్, జీమెయిల్ వాడకంలో ట్రిక్స్ చెబుతూ, సందేహాలు నివృత్తి చేస్తున్నాడు. అలాగే, అప్డేటెడ్ వెర్షన్లు, మార్కెట్లోకి వచ్చే మొబైల్ ఫోన్ల వివరాల సమాచారాన్ని అందిస్తున్నాడు.
ప్రస్తుతం యూట్యూబ్ చానల్ ‘తెలుగు టెక్‌ట్యూట్స్’కు 15.70 లక్షల మంది సబ్స్క్రైబర్లున్నారు. ఆయన వీడియోలను ఇప్పటి వరకు 17.2 కోట్ల మంది వీక్షించారు. వీడియోలకు 99.4 శాతం కచ్చితత్వం, వాస్తవికత ఉండడంతో ఫోర్బ్స్ జాబితాలో ఆయనకు స్థానం లభించింది.