కాకినాడ, ఆధ్రప్రభ ప్రతినిధి: దేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థ భారతీయ రైల్వే. ఇందులో 15లక్షల మందికి పైగా ఉద్యోగులు, సిబ్బంది ఉన్నారు. వీరుకాక మరో 8లక్షల మందికి పైగా తాత్కాలిక కార్మికులున్నారు. రైల్వేను అత్యవసర వ్యవస్థగా పరిగణిస్తారు. దీర్ఘకాలంగా రైల్వే ఉద్యోగులు తమకూ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కావాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరుతున్నారు. కాగా ప్రస్తుత ఎన్నికల సమయంలో వీరికి ఆ అవకాశం దక్కింది.
ఎన్నికల్లో ప్రతి ఓటు చాలా కీలకం. ఒక్క ఓటే జయాపజయాల్ని తలక్రిందులు చేసిన సందర్భాలున్నాయి. భారతీయ పౌరులందరికీ ఓటు వినియోగించుకోవడం హక్కే కాదు.. బాధ్యత కూడా. అయితే కొన్ని విభాగాలకు చెందిన ఉద్యోగులు, సిబ్బంది పోలింగ్ రోజున పోలింగ్ కేంద్రానికెళ్ళి ఓటేయడం కుదరదు. అలాంటివారి కోసం ఎన్నికల కమిషన్ పోస్టల్ బ్యాలెట్ విధానాన్ని ప్రవేశపెట్టింది.
ఇప్పటివరకు ఎన్నికల విధులు నిర్వహిస్తున్న సిబ్బందితోపాటు కొన్ని అత్యవసర విభాగాలకు మాత్రమే పోస్టల్ బ్యాలెట్‌ను అనుమతించారు. కానీ ఈసారి ఏకంగా 33 అత్యవసర సేవా విభాగాల్లో పనిచేస్తున్న వారందరికీ పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునే సదుపాయాన్ని కమిషన్ అందుబాటులోకి తెచ్చింది. అలాగే జిల్లాల వారీగా పోస్టల్ బ్యాలెట్‌ల జారీకి సంబంధించి నోడల్ అధికారుల్ని నియమించాలని కూడా రిటర్నింగ్ అధికారుల్ని ఆదేశించింది. ఇందుకు సంబంధించి 12బి ఫారాలను అన్ని రిటర్నింగ్ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచారు.
పోస్టల్ బ్యాలెట్ అవసరమైన ఉద్యోగులు తమ ఓటరు నమోదు కార్డుతో పాటు ఉద్యోగానికి సంబంధించిన ధ్రువీకణ పత్రాన్ని రిటర్నింగ్ అధికారికి అందించాలి. వారికి 12డి, 13ఎ, 13బి, 13సి, 13డి కవర్లను రిటర్నింగ్ సిబ్బంది అందిస్తారు. వాటిలోని సూచనల్ని ముందుగా క్షుణ్ణంగా చదవాలి. వాటిని అవగాహన చేసుకోవాలి. అనంతరం 13ఎ కవర్‌లో ఉండే డిక్లరేషన్ ఫారం పై ఓటరు సంతకం చేయాలి.
దానిపై గెజిటెడ్ అధికారిచే అటెస్టెడ్ చేయించాలి. దానిపై బ్యాలెట్ నెంబర్, సీరియల్ నెంబర్లు వేసి ఆ డిక్లరేషన్ ఫారాన్ని తిరిగి అదే కవర్లో పెట్టి అతికించాలి. 13బి కవర్లో నియోజకవర్గంలో పోటీ చేస్తున్న అభ్యర్దులు, పార్టీల పేర్లతో కూడిన బ్యాలెట్ పేపర్ ఉంటుంది. సాధారణ ఈవీఎమ్ లేదా బ్యాలెట్‌ల తరహాలో ఇందులో గుర్తులుండవు. పేర్లు పార్టీలు మాత్రమే నమోదు చేస్తారు. ఓటేయాలనుకున్న అభ్యర్థి ఎదురుగా స్కెచ్ పెన్‌తో రైట్ గుర్తును మాత్రమే నమోదుచేయాలి. ఒకరికి మించి టిక్ పెట్టినా, అస్పష్టంగా మార్క్ వేసినా ఆ ఓటును చెల్లనిదిగా పరిగణిస్తారు.
టిక్ పెట్టిన అనంతరం ఆ బ్యాలెట్‌ను 13బి కవర్‌లో పెట్టి అతికించాలి. ఆ కవర్‌పై బ్యాలెట్ పేపర్ సీరియల్ వేయాలి. అనంతరం 13ఎ, 13బి కవర్లను 13సి కవర్లో పెట్టి అతికించాలి. దీన్ని 13డి కవర్లో పెట్టి సంబంధిత రిటర్నింగ్ అధికారి చిరునామా రాసి పోస్టల్ ద్వారా లేదా ఓట్ల లెక్కింపు తేదీలోగా రిటర్నింగ్ అధికారికి అందించాలి. కొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగుల సౌకర్యం కోసం డ్రాప్ బాక్స్‌లను కూడా ఏర్పాటు చేస్తున్నారు.
ఈసారి ప్రయాణీకుల రైళ్ళు, గూడ్స్ రైల్వే, మెట్రో, ఇతర ప్రభుత్వ రవాణా సేవలు, విద్యుత్, బీఎస్‌ఎన్‌ఎల్, పోస్టల్, దూరదర్శన్, ఆకాశవాణి, రాష్ట్రప్రభుత్వ అధీనంలోని పాలసరఫరా సంస్థలు, వైద్య, ఆరోగ్య శాఖల ఉద్యోగులు, విమానయానం, రోడ్డు రవాణా సంస్థ, అగ్నిమాపక సేవలు, పోలీస్, అంబులెన్స్, షిప్పింగ్, జైళ్ళు, ఎక్సైజ్, వాటర్ అథారిటీ, ట్రజరీ సేవలు, అటవీశాఖ, పౌరరక్షణ, హోమ్‌గార్డులు, ఆహార పౌరసరఫరాలు, ఇంధనం, ఎయిర్‌పోర్ట్ అథారిటీ, పీడబ్ల్యూడీ, నేషనల్ ఇన్ఫార్మాటిక్స్ సెంటర్లు పౌర సంబంధాల శాఖతో పాటు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, పోలింగ్ రోజున ఎన్నికల కమిషన్ అధీక ృత మీడియా ప్రతినిధులకు కూడా పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకునే సదుపాయం కమిషన్ కల్పించింది.
తెలుగురాష్ట్రాల్లో సుమారు 90వేల మంది రైల్వే ఉద్యోగులు, సిబ్బంది ఉన్నారు. వీరిలో 40వేల మంది అత్యవసర సేవల్లో ఉంటారు. లోకో పైలెట్లు, అసిస్టెంట్ లోకో పైలెట్లు, గార్డులు, టీటీఈ వంటి రన్నింగ్ స్టాఫ్‌తో పాటు స్టేషన్ మాస్టర్లు, సిగ్నలింగ్ వ్యవస్థ ఉద్యోగులున్నారు. వీరంతా పోలింగ్ రోజున బూత్‌కెళ్ళి ఓటేసే పరిస్థితి ఉండదు. ఇప్పటివర కు వీరిలో అత్యధికులు తమ ఓటు హక్కును వినియోగించుకోలేకపోతున్నారు. కాగా కమిషన్ నిర్ణయంతో వీరంతా ఈ సారి పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ రాజ్యాంగ బద్ద హక్కు వినియోగానికి అవకాశం కలిగింది.