చరిత్రలోనే తొలిసారిగా సుప్రీంకోర్టులో విచారణలు లైవ్‌లో ప్రసారం చేశారు. అయితే ఈరోజు లైవ్ స్ట్రీమింగ్‌ను కేవలం సీజేఐ ఎన్వీ రమణ వీడ్కోల కోసం మాత్రమే వాడారు. సంప్రదాయం ప్రకారం.. సీజేఐ ఎన్వీ రమణతో పాటు తదుపరి సీజే ఉన్న ధర్మాసనం విచారణను ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఎన్వీ రమణ ఈరోజు పదవీ విరమణ చేయనున్నారు. జస్టిస్ యూయూ లలిత్ 49వ సీజేగా విధులు నిర్వర్తించనున్నారు. ఎన్ఐసీ వెబ్ పోర్టల్‌లో ఈ కార్యక్రమాన్ని లైవ్ చేశారు. రాజ్యాంగపరంగా కీలకమైన కేసులకు సంబంధించిన విచారణను లైవ్ స్ట్రీమింగ్ చేసేందుకు గతంలో త్రిసభ్య ధర్మాసనం అనుమతి ఇచ్చింది.
2018, సెప్టెంబర్ 26వ తేదీన అప్పటి సీజే దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖాన్‌విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం ఆ తీర్పును వెలువరించింది. అయితే సీజేఐ రమణ రిటైర్మెంట్ లోపే లైవ్ ప్రసారాలను ప్రారంభించాలని గతంలో సుప్రీంకోర్టు తీర్మానించింది. కేసుల లైవ్ ప్రసారాల కోసం సుప్రీంకోర్టుకు చెందిన ఈ-కమిటీ ఇండిపెండెంట్ ఫ్లాట్‌ఫామ్‌ను డెవలప్ చేసింది. 13 సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిగా పనిచేసిన జస్టిస్ ఎన్వీ రమణ…. సీజేఐగా 2021 ఏప్రిల్ లో బాధ్యతలు చేపట్టారు. జస్టిస్ కోకా సుబ్బారావు తర్వాత సుదీర్ఘకాలం సీజేఐగా చేసిన తెలుగు వ్యక్తిగా రికార్డు సృష్టించిన ఎన్వీ రమణ..సీజేఐగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సుప్రీంకోర్టు కార్యకలాపాలు ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు కృషి చేస్తున్నారు. సుప్రీం కోర్టులోనే కాకుండా అన్ని కోర్టుల నుంచి ఈ ప్రత్యక్ష ప్రసారాలు కొనసాగాలని ఎన్వీ రమణ ఆకాంక్షించారు.