వరంగల్ ను హైదరాబాద్ కు ధీటుగా తీర్చి దిద్దాలని.. ప్రపంచం మొత్తం వరంగల్ వైపు చూసేలా అభివృద్ధి చేయడమే తన ముందున్న లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హనుమకొండ లోని ఆర్ట్స్ కాలేజీలో ఏర్పాటుచేసిన కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పాలన విజయోత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలని తెలంగాణ ప్రభుత్వం కంకణం కట్టుకుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
నేడు ఉక్కు మహిళ ఇందిరమ్మ 107వ జయంతి సందర్భంగా వారికి నివాళులు, ఈ కార్యక్రమం మా ఆడబిడ్డలకు అంకితం చేశారు. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం రావాలని మహిళలందరూ తమ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించారని, సోనియమ్మ ఆశీర్వాదంతో తాను ముఖ్యమంత్రి అయ్యానన్నారు. ఇది ఆడబిడ్డల ప్రభుత్వం అని గర్వంగా చెప్పుకుంటాం. టాటా బిర్లాలను తలదన్నేల ఆడబిడ్డలను వ్యాపారస్తులుగా కాంగ్రెస్ ప్రభుత్వం తీర్చిదిద్దబోతోంది.
చారిత్రాత్మక వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టాం. అందుకే వరంగల్ అభివృద్ధికి దాదాపు రూ.6 వేల కోట్లు కేటాయించాం. వరంగల్ లో అభివృద్ధి జరిగితే సగం తెలంగాణ అభివృద్ధి జరిగినట్లే. వరగంల్ ను అభివృద్ధి చేసే వరకు నిద్రపోయేది లేదు.
పక్క రాష్ట్రాలలో ఎక్కడ చూసినా ఎయిర్ పోర్టులు కనిపిస్తున్నాయని, మన తెలంగాణ రాష్ట్రంలో ఒకే ఒక్క ఎయిర్ పోర్టు హైదరాబాద్ లో ఉందన్నారు. తెలంగాణ వ్యాప్తంగా నాలుగు ఎయిర్ పోర్టులను ఏర్పాటు చేసేంతవరకు నిరంతర కృషి చేస్తానని, కేంద్ర ప్రభుత్వం సైతం ఈ దిశగా నిర్ణయం తీసుకోవాలన్నారు. తెలంగాణ అభివృద్ధికి ఎవరు అడ్డుపడినా సహించే ప్రసక్తే లేదని సీఎం హెచ్చరించారు.
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనను ప్రజా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి పూర్తి చేసుకుందని సీఎం రేవంత్ అన్నారు.ఇప్పటికే తాము ఇచ్చిన హామీలను నెరవేర్చామని, నిరుద్యోగ సమస్యకు పరిష్కారంగా నోటిఫికేషన్స్ కూడా విడుదల చేసి పలు పోస్టులను భర్తీ చేశామన్నారు. మరో నాలుగు సంవత్సరాలు ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా, తెలంగాణ అభివృద్ధి లక్ష్యంగా చివరి రక్తపు బొట్టు వరకు తెలంగాణ ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ప్రజా సంక్షేమం కోసమే కేటాయిస్తానంటూ సీఎం తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, ఎమ్మేల్యేలు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.