అతని పేరు డేవిడ్ కే చాన్. జన్మతః చైనీయుడు. 72 ఏళ్లు. లాస్ఏంజిల్స్ లో స్ధిరపడ్డాడు. టాక్స్ లాయర్‌గా పని చేసి విశ్రాంతి తీసుకుంటున్నాడు.. ఆహారం విషయంలో ఆయనకు ప్రత్యేకమైన అభిరుచులున్నాయి. ఏదో ఆకలి తీర్చుకోవడానికి తినడం అంటే ఆయనకు మహా చిరాకు. అందుకే ఏపూటకాపూట భిన్నమైన ఆహారపదార్ధాలను రుచి చూడాలనుకుంటాడు. అలా రుచి చూసిన కొత్తరకం మెనూల గురించి తన ఇన్స్టాగ్రామ్, బ్లాగ్‌ల్లో పోస్టు చేస్తుంటాడు. ఇప్పటిదాకా అతను అమెరికాలోని ఎనిమిదివేల చైనా రెస్టారెంట్లు సందర్శించి రికార్డు నెలకొల్పాడు.
1960 సంవత్సరం నుంచి ఆయన ఇలా చైనా రెస్టారెంట్లు అమెరికాలో ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకుని మరీ వెళ్లి అక్కడి ఆహారపదార్ధాల గురించి తెలుసుకుని, వాటి రుచి చూసి ఒక పరిశోధనగా చేస్తున్నాడు. అమెరికాలోని చైనీయుల చరిత్ర తెలుసుకోవాలంటే చైనీ రెస్టారెంట్లు తిరిగితే సరిపో్తుందని, పనిలో పనిగా తన ఉనికిని, తన గుర్తింపుని కూడా తెలుసుకోవచ్చునని ఆయన ఉద్దేశం. అమెరికా వ్యాప్తంగా ఉన్న చైనీయుల జీవనశైలిని కూడా ఈ హోటళ్లు, రెస్టారెంట్ల ద్వారా తెలుసుకోవచ్చునని ఆయన బీబీసీ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇన్నేళ్లుగా తాను చైనా రెస్టారెంట్లకు వెళ్లడం ఒక అలవాటుగా మారిపోయిందని, దీంతో ఇప్పుడు తానిక చైనా హోటళ్లలోనే తినడానికి ఇష్టపడే పరిస్థితి వచ్చిందని అంటున్నాడు. బియ్యం, సూప్ లు, స్నాక్స్..ఇలా ఏవైనా తినేస్తానంటున్నాడు.
అయితే షుగర్, కొవ్వు పదార్ధాలకు మాత్రం దూరంగా ఉంటానని, ఎక్కడికి వెళ్లినా ఆ జాగ్రత్తలు పాటిస్తానని చెబుతున్నాడు. నిత్యం ఎక్సరసైజులు చేస్తూ తనని తాను ఫిట్‌గా ఉంచుకుంటూ కొత్తకొత్త చైనా రెస్టారెంట్ల కోసం తిరుగుతూనే ఉంటానన్నాడు. తనని తాను రెస్టారెంట్ల కలెక్టర్ గా అభివర్ణించుకుంటున్న చాన్ వివిధ న్యూస్ వెబ్సైట్లు, సోషల్ మీడియాలో తరచూ దర్శనమిస్తూ..అమెరికాలో చైనీయుల ఉనికి, చైనా రెస్టారెంట్ల ఘనతను చాటుతున్నాడు.
లోకల్ టు గ్లోబల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసంఫేస్‌బుక్, ట్విట్టర్పేజీలను ఫాలో అవ్వండి..