అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) ఫుట్‌బాల్ క్లబ్స్‌కు భారీ బొనాంజా ప్రకటించింది. 51 దేశాలకు చెందిన 440 క్లబ్స్‌కు దాదాపు రూ.1000 కోట్లకు పైగా కేటాయించనుంది. గతేడాది ఖతార్‌లో జరిగిన వరల్డ్ కప్‌లో 440 క్లబ్స్‌కు చెందిన ఆటగాళ్లు పాల్గొన్నారు. ఆయా క్లబ్స్ పాత్రకు గుర్తింపుగా 209 మిలియన్ డాలర్లను బహుమతిగా ఇవ్వనున్నట్లు ఫిఫా వెల్లడించింది. వరల్డ్ కప్ జట్టులో ఉన్న ప్రతి ఆటగాడికి రోజుకు రూ.8 లక్షలు ఇవ్వనున్నట్టు స్పష్టంచేసింది.
ఫిఫా నిర్ణయంతో 837 మంది ఆటగాళ్లు లబ్ది పొందనున్నారు. నాలుగేళ్ల క్రితంతో పోలిస్తే ప్రతి ఫుట్‌బాలర్‌కు ఈసారి లక్ష రూపాయలు అదనంగా లభించనున్నాయి. 2018లో రష్యాలో వరల్డ్ కప్ ముగిశాక ఒక్కొక్క ఫుట్‌బాలర్‌కు రోజుకు రూ.7 లక్షల చొప్పున ఇచ్చారు. ఫిఫా నిర్ణయం వల్ల ఇంగ్లీష్ ఫుట్‌బాల్ క్లబ్స్‌కు ఎక్కువ వాటా లభించనుంది.
దాదాపు 46 క్లబ్స్‌కు రూ.300 కోట్లకు పైగా దక్కనున్నాయి. మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్‌కు అత్యధికంగా రూ.37 కోట్లు అందుతాయి. ఆ తర్వాత బార్సిలోనా, బేయెర్న్ మ్యునిచ్ క్లబ్‌కు భారీ డబ్బు ముట్టనుంది. ఇంగ్లీష్ క్లబ్స్ తర్వాత స్పెయిన్, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్ క్లబ్స్‌కు భారీ మొత్తంలో డబ్బులు చేతికందనున్నాయి.