Friday, November 22, 2024

ఆహార సంక్షోభం తప్పదు.. 2023లో ప్రపంచ దేశాల్లో ఉత్పాతమే

ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర కారణంగా ప్రపంచం ఆహార సంక్షోభాన్ని ఎదుర్కోక తప్పదని, వ్యవసాయం, పంటల నూర్పిడి, కోతలు, నిల్వలపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయ సంస్థ (యునైటెడ్‌ నేషన్స్‌ ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌) ఆందోళన వ్యక్తం చేసింది. ఈ యుద్ధం ప్రభావం ఆ రెండు దేశాలకే పరిమితం కాబోదని పేర్కొంది. ప్రత్యేకించి వచ్చేఏడు వ్యవసాయం, పంటల కోత, నిల్వ చేయడంవంటివి అత్యంత క్లిష్టంగా మారబోతున్నాయని హెచ్చరించింది. రోమ్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఆ సంస్థకు చెందిన ప్రధాన ఆర్థికవేత్త మాక్సిమో టొరెరో ఆహార సంక్షోభంపై ప్రపంచ దేశాలను అప్రమత్తం చేశారు. జిన్‌హువా వార్తాసంస్థకు ఆన్‌లైన్‌లో ఇచ్చిన ముఖాముఖిలో రానున్న ముప్పును గురించి వివరించారు. ప్రపంచ దేశాల్లో ఆహార ధాన్యాల కొరత ఏర్పడుతుందని, వాటి ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండబోవని హెచ్చరించారు. మొక్కజొన్న, గోధుమ, జొన్న వంటి తృణధాన్యాల ఉత్పత్తిలో రష్యా, ఉక్రెయిన్‌ కీలకమని, అంతర్జాతీయంగా ఆయా ధాన్యాల ఉత్పత్తిలో 30 శాతం ఆ రెండు దేశాలే పండిస్తున్నాయని ఆయన గుర్తు చేశారు. మార్చిలో ఆహార ధాన్యాల ధరలు అమాంతం పెరిగాయని, తరువాతి నెలల్లో మిగతా వాటి ధరలు తగ్గినా తృణధాన్యాల ధరలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయని చెప్పారు.

ఈ పరిస్థితుల్లో పేద దేశాలు ఆహార ధాన్యాలను కొనుగోలు చేయలేవని, ఆయా దేశాల ప్రజలు ఆకలితో అలమటించే దుస్థితి ఏర్పడబోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక 2022-23లో ఎరువుల కొరత కూడా ఎదురు కాబోతోందని, అందువల్ల పంటల దిగుబడి తగ్గుతుందని అంచనావేశారు. నైట్రోజన్‌ ఎరువుల తయారీలో రష్యా అగ్రగామని అని, పొటాషియం ఎరువుల ఉత్పత్తిలో ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉందని, గతంతో పోలిస్తే ఇప్పటికే ఎరువుల సరఫరా మందగించిందని చెప్పారు. యుద్ధం ప్రభావం వల్ల పంటల దిగుబడి దాదాపు 10 శాతం తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. ఎరువుల కొరత, చీడపీడల నివారణ సాధ్యం కాకపోవడంవల్ల ఈ పరిస్థితు ఏర్పడుతుందని చెబుతున్నారు. ఉక్రెయిన్‌ వ్యవసాయ ఉత్పత్తుల్లో 90 శాతం నల్లసముద్రం మీదుగా ఇతర దేశాలకు ఎగుమతులు చేస్తుందని, గతేడాది ఉత్పత్తి చేసిన పంటలన్నీ దేశంలోనే నిలిచిపోయాయని, ఇప్పటికే 2 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు వివిధ నౌకాశ్రయాల్లో పేరుకుపోయాయని చెప్పారు. వాటిని సకాలంలో రైతులు అమ్ముకోలేకపోతే పెట్టుబడికి తగిన డబ్బు వారికి అందదని, ఫలితంగా సాగు విస్తీర్ణం తగ్గుతుందని చెప్పుకొచ్చారు. ఉక్రెయిన్‌ పోర్టుల్లో నిలిచిపోయిన ఆహార ధాన్యాల ఎగుమతులు ఎంత తొందరగా మొదలైతే సంక్షోభం తీవ్రత అంత తగ్గుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement