హైదరాబాద్, ఆంధ్రప్రభ : కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న 16 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఆయన ప్రధాన మంత్రి నరేంద్రమోడీకి బహిరంగ లేఖ రాశారు. దేశానికి పెట్టుబడులను భారీగా రప్పించి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో విఫలమయ్యారని విమర్శించారు. కేంద్రప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయకుండా నిద్రపోతున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వంలోని ఖాళీలతోపాటు పబ్లిక్ సెక్టార్ లోని అనేక కంపెనీల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయకుండా పెండింగ్లో పెట్టారని పేర్కొన్నారు. ఒక వైపు ఉన్న ప్రభుత్వరంగంలోని ఉద్యోగాలను భర్తీ చేయకుండా తాత్సారం చేస్తూనే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను అందినకాడికి అమ్ముతూ లక్షలాది ఉద్యోగాలను ఊడగొడుతున్నారని గుర్తు చేశారు. ప్రస్తుత లెక్కల ప్రకారం ఖాళీగా ఉన్న 16 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను మీ నాయకత్వంలోని కేంద్ర సర్కార్ ఎప్పుడు భర్తీ చేస్తుందన్నది భేతాళ ప్రశ్నగా మిగిలిపోయిందని లేఖలో కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘ప్రజల ఆకాంక్షలు, అలుపెరగని ఉద్యమాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా తెలంగాణ యువత తరపున నేను కీలకమైన అంశాన్ని మీ దృష్టికి తీసుకువస్తున్నాను. తెలంగాణ ఉద్యమానికి ప్రాతిపాదికైన నీళ్లు, నిధులు, నియామకాలు అనే కీలక అంశాల్లో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా ఎనిమిది సంవత్సరాలుగా మా ప్రభుత్వం అద్భుతమైన కృషి చేస్తున్నది.
ముఖ్యంగా తెలంగాణ యువతకు కావాల్సిన ఉపాధి అవకాశాల కల్పన కోసం రెండంచెల వ్యూ#హంతో పనిచేస్తున్నాం. నూతన రాష్ట్రం అయినప్పటికీ వినూత్న, విప్లవాత్మక పారిశ్రామిక విధానాలతో లక్షల కోట్ల రూపాయలను తెలంగాణకు పెట్టుబడులుగా తెచ్చాము. త్రికరణశుద్దిగా మేం చేస్తున్న ప్రయత్నాలతో ప్రైవేటురంగంలో సుమారు 16 లక్షల ఉపాధి అవకాశాలను యువత అందిపుచ్చుకుంది. భారత ప్రధానమంత్రి అయిన మీకు ఈ విషయంలో తగినంత సమాచారం ఉండే ఉంటుందని భావిస్తున్నాను. పారిశ్రామిక, ప్రైవేటు రంగ ఉద్యోగాల్లో తెలంగాణ ప్రభుత్వం సాధిస్తున్న పురోగతిని మీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వమే పలు వేదికలపై లెక్కలేనన్ని సార్లు ప్రశంసించిన విషయం మీకు తెలిసే ఉంటుంది. ప్రజాసంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న మేము, ప్రభుత్వ రంగంలోనూ ఇప్పటిదాకా సుమారు లక్షా 32 వేల ఉద్యోగాలను మేం భర్తీ చేశాం. తాజాగా మరో లక్ష ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను మొదలుపెట్టి, మాది ఒట్టి మాటల ప్రభుత్వం కాదు గట్టి చేతల ప్రభుత్వమని ప్రజలతోనే శభాష్ అనిపించుకుంటున్నాం. ఒక రాష్ట్రంగా మాకున్న పరిమిత వనరులతోనే భారీ ఉపాధి, ఉద్యోగ అవకాశాలను మా ప్రజలకు కల్పిస్తున్నాం. ఇదే సమయంలో దేశ ప్రజలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో ప్రధానమంత్రిగా మీరు విఫలమయ్యారనే భావన నెలకొంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిన వాగ్ధానాలు, చెప్పిన మాటలను అధికారంలోకి వచ్చిన తరువాత మీరు మర్చిపోయారు.
ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని ఎంతో గంభీరంగా మీరు మాట్లాడినదంతా డాంభికమే అనడానికి ఎనిమిదేళ్ల మీ పాలనే నిదర్శనంగా కనిపిస్తోంది. మీ అసమర్థ నిర్ణయాలు, అర్ధిక విధానాలతో కొత్త ఉద్యోగాలు రాలేదు సరికదా ఉన్న ఉపాధి అవకాశాలకు గండి కొట్టారు. మీరు తీసుకున్న నోట్ల రద్దు, కరోనా లాక్ డౌన్ వంటి అనాలోచిత నిర్ణయాలతో దేశ ప్రజల ఉపాధి, ఉద్యోగ అవకాశాలకు కోలుకోలేని దెబ్బ తాకింది. ఉన్న ఉద్యోగాలు పొయి కేవలం పకోడీ ఉద్యోగాలే మిగిలాయన్నది వాస్తవం. భారీ ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే విదేశీ పరిశ్రమలను దేశానికి రప్పించే విషయంలో మీకు ఒక స్పష్టమైన విధానం లేదనడానికి నాకెలాంటి సందేహం లేదు. వ్యవసాయం రంగంతో పాటు, దాని తరువాత అత్యధికంగా ప్రజలు ఆధారపడ్డ టెక్స్ టైల్ రంగ అభివృద్ధిపై మీ ప్రభుత్వానికి చిత్తశుద్ది అసలే లేదు. అందుకే పొరుగున ఉన్న చిన్న దేశాల కన్నా తక్కువమందికి మనదేశంలో టెక్స్టైల్ రంగంలో ఉపాధి లభిస్తోంది. మన ఆర్థిక వ్యవస్థలో కీలకమైన ఈ రెండు రంగాలను మీరు కావాలని విస్మరించడంతోనే ప్రస్తుతం దేశంలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు తగ్గిపోయాయన్నది నిజం. మీ ఈ విధానాల కారణంగానే గత 45 ఏళ్ళలో ఎన్నడూ లేనంతగా దేశంలో నిరుద్యోగం పెరిగిందన్న భారత ప్రభుత్వ గణాంకాలే ఇందుకు తిరుగులేని సాక్ష్యం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీలో మీరు విఫలం అయిన నేపథ్యంలో, మీ నుంచి కొన్ని ప్రశ్నలకు సమాధానాలను దేశ యువత ఆశిస్తోంది. సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ అని మీరు ఓ వైపు గప్పాలు కొడుతుంటే మీ పార్టీ నేతలు మాత్రం సబ్ కో సత్తేనాశ్ కరో అన్నట్టే వ్యవహరిస్తున్నారు. బీజేపీ నేతల వ్యాఖ్యల ప్రభావం వల్ల కేవలం దేశంలోనే కాకుండా విదేశాల్లోని భారతీయుల ఉపాధికి ప్రమాదం ఏర్పడుతోంది. మీరు గతంలో కూడా తెలంగాణకు వచ్చి తియ్యగ,పుల్లగ మాట్లాడిన్రు. కాని పైసా సాయం చెయ్యలేదు. కనీసం ఇప్పుడైనా తెలంగాణ గడ్డ నుంచి దేశ యువతకు ఉద్యోగ కల్పనపై మీ వైఖరి స్పష్టం చేయండి. దేశ యువత ఉద్యోగాలపైన నేను లేవనెత్తిన అంశాలకు సమాధానం ఇవ్వండి. లేకుంటే తెలంగాణ యువతతో కలిసి కేంద్రం మీద ఒత్తిడి తీసుకువచ్చేలా, ఉద్యోగాల భర్తీ జరిగేదాకా ఉద్యమిస్తామ’ని కేటీఆర్ హెచ్చరించారు.
లేఖలో కేటీఆర్ సంధించిన ప్రశ్నలు…
- కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలను ఎప్పుడు భర్తీ చేస్తారు?
- బీజేపీ అధికారంలోకి వస్తే ఇస్తామన్న రెండు కోట్ల ఉద్యోగాల భర్తీకి సంబంధించి చేపట్టిన చర్యలు ఏమిటి?
- మీరు ఇస్తామన్న యేటా రెండు కోట్ల ఉద్యోగాల్లో తెలంగాణ యువత వాటా ఎంత
- ఒకవైపుప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయకుండా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేయడంతో జరుగుతున్న ఉద్యోగాల నష్టం పైన సమాధానం చెప్పాలి.
- ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ పరం చేయడంతో ఆయా సంస్థల్లో రిజర్వేషన్ అమలుకాదు. ఫలితంగా కోట్లాది దళిత, గిరిజన, బీసీ వర్గాలకు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు దక్కవు. ఈ విషయంలో ఆయా వర్గాల యువతకు కేంద్రమిచ్చే సమాధానం ఏంటి
- ఈ దేశ ఆర్థిక వ్యవస్థకు ఇతోధికంగా చేయూతనిస్తున్న తెలంగాణ రాష్ట్రానికి మీరు ఇచ్చే ప్రాధాన్యం ఏంటీ?
- ఉపాధి, ఉద్యోగ అవకాశాల కల్పనపై తెలంగాణ యువతకు ఏం ఏం చెపుతారు?
- హదరాబాద్ ఐటీఐఆర్ ప్రాజెక్టు పునరుద్ధరణ లేదా ప్రత్యామ్నాయంగా మరో ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని 8 సంవత్సరాలుగా తెలంగాణ యువత తరఫున మేం చేస్తున్న డిమాండ్ పై మీ దగ్గర అసలు సమాధానం ఉందా అని లేఖలో కేటీఆర్ ప్రశ్నించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.