Thursday, November 21, 2024

Followup : గోవా కాంగ్రెస్‌లో తిరుగుబాటు?.. గోడ దూకనున్న ఆరుగురు ఎమ్మెల్యేలు

గోవా కాంగ్రెస్‌లో సంక్షోభం ఏర్పడే సూచనలు కన్పిస్తున్నాయి. ఆ పార్టీకి చెందిన సీనియర్‌ ఎమ్మెల్యే దిగంబర్‌ కామత్‌ సారథ్యంలో ఆరుగురు శాసనసభ్యులు కాంగ్రెస్‌పై తిరుగుబాటు బావుటా ఎగరవేసి బీజేపీ గూటిలోకి చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. బీజేపీలో చేరేవారిలో కీలక నేత, ఎమ్మెల్యే మైఖేల్‌ లోబోకూడా ఉన్నారని చెబుతున్నారు. శనివారం జరిగిన కాంగ్రెస్‌ పక్ష సమావేశానికి ఎమ్మెల్యేలు కొందరు హాజరుకాలేదు. సోమవారం నుంచి శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ తిరుగుబాటు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరబోతున్నారంటూ వార్తలు గుప్పుమన్నాయి. అయితే పార్టీ వర్గాలు మాత్రం ఈ ప్రచారాన్ని కొట్టి పారేస్తున్నాయి. తాను ఏ పార్టీలోనూ చేరబోవడం లేదని, ఎందుకు దుష్ప్రచారం చేస్తున్నారో తెలియడం లేదని లోబో వ్యాఖ్యానించారు. ఇదంతా బీజేపీ ఉద్దేశపూర్వకంగా చేస్తున్న ప్రచారమేనని, పార్టీలో ఎలాంటి అసంతృప్తి, అసమ్మతి వంటివి ఏవీ లేవని కాంగ్రెస్‌ గోవాశాఖ అధ్యక్షుడు అమిత్‌ పట్కార్‌ పేర్కొన్నారు.

శనివారంనాటి భేటీకి తనతోపాటు ఏడుగురు ఎమ్మెల్యేలు హాజరైనారని, ఇది అధికారిక సమావేశం కాదని, మర్యాదపూర్వక భేటీ మాత్రమేనని, బీజేపీలో కొందరు చేరబోతున్నారంటూ వస్తున్న వార్తలపై తానేమీ స్పందించలేనని ఎమ్మెల్యే అలెక్సీ సిఖేరియా అన్నారు. గత ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎన్నికలకు వెళ్లిన దిగంబర్‌ కామత్‌ శనివారంనాటి భేటీకి గైర్హాజరవడం విశేషం. తనను ఖాదని మైఖేల్‌ లోబోను విపక్ష నేతగా అధిష్ఠానం ప్రకటించడంతో దిగంబర్‌ కామత్‌ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. గత ఏడాది జరిగిన శాసనసభ ఎన్నికల సమయంలో బీజేపీనుంచి కాంగ్రెస్‌లో చేరిన లోబో కూడా అసంతృప్తితో ఉన్నారని, బీజేపీ అధిష్టానంతో సంప్రదింపులు జరుపుతున్నారని తెలుస్తోంది. 40 మంది శాసనసభ్యులున్న గోవా అసెంబ్లిలో అధికార ఎన్డీయే కూటమికి 25మంది శాసనసభ్యుల బలం ఉంది. కాగా కాంగ్రెస్‌కు 11మంది ఎమ్మెల్యేలున్నారు. 2019లో చాలామంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు గెలిచిన తరువాత బీజేపీలో ఫిరాయించిన విషయం తెలిసిందే. అయితే, ఈసారి మాత్రం 11మంది విజేతలూ ఇప్పటివరకూ కాంగ్రెస్‌ పక్షానే ఉన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement