Saturday, November 23, 2024

Followup : విద్వేష వ్యాఖ్యలపై దేశవ్యాప్త దుమారం.. ప్రార్థనల తర్వాత ముస్లింల‌ ఆందోళనలు..

మాజీ బీజేపీ నేతలు నుపుర్‌శర్మ, నవీన్‌జిందాల్‌ వ్యాఖ్యలపై చెలరేగిన దుమారం ఇంకా సమసి పోలేదు.శుక్రవారం మత ప్రార్థనల అనంతరం ఆ వ్యాఖ్యలపై దేశవ్యాప్త ఆందోళన నిర్వహించారు. వేలాది మంది ముస్లింలు ఢిల్లి, యూపీ, పశ్చిమబెంగాల్‌, తెలంగాణ, జార్ఖండ్‌ రాష్ట్రాల్లో రోడ్ల మీదకు వచ్చి ఆందోళనలకు దిగారు. నుపుర్‌శర్మను అరెస్ట్‌ చేయాలని ఆందోళనకారులు ప్లకార్డులతో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.పలుచోట్ల నుపుర్‌శర్మ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఆందోళనకారులను చెదరగొడుతున్న పోలీసులపై రాళ్లు రువ్విన సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. ఈ వివాదంలో తలదూర్చకుండా భారతీయ జనతా పార్టీ దూరంగా ఉండి పోయింది. ప్రవక్తపై శర్మ, జిందాల్‌ చేసిన వ్యాఖ్యలు వారి వ్యక్తిగతమని ప్రకటించింది. నుపుర్‌శర్మను అరెస్ట్‌ చేయాలనే డిమాండ్‌తో దేశవ్యాప్తంగా జరిగిన ఆందోళనలపై కేంద్ర హోంశాఖ దృస్టి సారించింది.

ఢిల్లిలోని జమా మసీదులో ప్రార్థనల అనంతరం ప్రార్థనలో పాల్గొన్న ముస్లింలు నుపుర్‌శర్మను అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. పెద్దసంఖ్యలో హాజరైన ఆందోళనకారులు సస్పెండ్‌ అయిన నుపుర్‌శర్మ, నవీన్‌జిందాల్‌లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జమా మసీదు ప్రార్థనలో 1500 మంది పాల్గొనగా, అనంతరం జరిగిన ఆందోళనలో 300 మంది పాల్గొన్నారు. అయితే, జమా మసీదు ఇమామ్‌ మాత్రం ఆందోళనలకు దూరంగా ఉన్నారు. మసీదు అధికారులు ఆందోళనలకు పిలుపునివ్వలేదని స్పష్టం చేశారు. ప్రార్థనల అనంతరం ఆందోళన జరుగుతుందనే విషయం కూడా తెలియదని ప్రకటించారు. ఆందోళనకారులు ఓవైసీ వర్గం, లేదా ఏఐఏఐఎం పార్టీకి చెందిన వారని ప్రకటించారు. వారికి తమ మద్దతు లేదని స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య ఘర్షణ జరిగింది. ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. మోరాదాబాద్‌, సహారాన్‌పూర్‌ జిల్లాల్లో సైతం నుపుర్‌శర్మ, జిందాల్‌లను అరెస్ట్‌ చేయాలని ఆందోళనకారులు డిమాండ్‌ చేశారు. సహరాన్‌పూర్‌ జిల్లాలో సుమారు 36మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

యూపీలోని లక్నో, కాన్పూర్‌, ఫిరోజాబాద్‌లో పోలీసులు భద్రతను పెంచారు. మాజీ బీజేపీ నేతలకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలు జార్ఖండ్‌లోని రాంచీలో హింసాత్మకంగా మారాయి. ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆందోళనకారులపై పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారు. తెలంగాణలో సైతం నుపుర్‌శర్మ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఆందోళనలు జరిగాయి. హైదరాబాద్‌లోని మక్కా మసీదు లో ప్రార్థనల అనంతరం మసీదు వెలుపల ఆందోళన నిర్వహించారు. అనంతరం ఆందోళనకారులు తమ ఆందోళన విరమించారు. దీంతో పోలీసులు భారీస్థాయిలో భద్రతా బలగాలను మోహరించారు. పశ్చిమబెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో వందలాది మంది ఆందోళనకారులు నుపుర్‌శర్మను అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ముస్లింలు నిరసన ప్రదర్శనలు నిర్వహించడంతో పాటు రోడ్లను దిగ్భంధించారు. హౌరాబ్రిడ్జిపై కూడా ఆందోళనకారులు నుపుర్‌శర్మకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్‌గ్యాస్‌ను ప్రయోగించగా, పోలీసులపై వారు రాళ్లు రువ్వడం జరిగింది. దీంతో, రైల్వే అధికారులు హౌరా – ఖరగ్‌పూర్‌ లైన్‌లో రైళ్లను నిలిపివేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement