న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: రాజ్యసభ ప్యానల్ వైస్‌చైర్మన్‌గా వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వి. విజయసాయి రెడ్డికి అవకాశం లభించింది. రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు ఈ మేరకు వైస్ చైర్మన్ల ప్యానెల్‌ను నియమించారు. రాజ్యసభ ఎంపీలు భువనేశ్వర్ కలిత, ఇందు బాల గోస్వామి, డాక్టర్ ఎల్. హనుమంతయ్య, తిరుచ్చి శివ, వి. విజయసాయి రెడ్డి, డాక్టర్ సుస్మిత్ పాత్రల వైస్ చైర్మన్‌ల ప్యానెల్‌లో సభ్యులుగా పునర్వ్యవస్థీకరించారు. ఇదివరకటి ప్యానెల్‌లో సభ్యుల్లో కొందరికి రాజ్యసభ సభ్యత్వం పదవీకాలం ముగిసింది.
వారి సభ్యత్వాన్ని ఆయా పార్టీలు కొనసాగించలేదు. ఈ క్రమంలో రెండోసారి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన విజయసాయి రెడ్డికి ప్యానెల్‌లో చోటు దక్కింది. సభ కార్యకలాపాలు జరుగుతున్న సమయంలో రాజ్యసభ చైర్మన్, వైఎస్ చైర్మన్ ఇద్దరూ అందుబాటులో లేకపోతే ప్యానల్ సభ్యుల్లో ఒకరు ఆ బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుంది. తద్వారా తాత్కాలికంగా సభాపతి స్థానంలో కూర్చుని సభను నిర్వహించడం జరుగుతుంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.