న్యూఢిల్లి:ఉపరాష్ట్రపతి ఎన్నికల బరిలో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి, మాజీ గవర్నర్ మార్గరెట్ అల్వా(80)ను ఎంపిక చేశారు. ఆదివారం జరిగిన విపక్ష నేతల భేటీ అనంతరం ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఆమె పేరును ప్రకటించారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థిగా ఎంపికైన ప.బెంగాల్ మాజీ గవర్నర్ జగ్దీప్ ధన్‌ఖడ్‌తో ఆమె తలపడనున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం పాటు పనిచేసిన ఆల్వా గోవాకు 17వ, గుజరాత్‌కు 23వ, రాజస్థాన్‌కు 20వ, ఉత్తరాఖండ్‌కు నాల్గవ గవర్నర్‌గా బాధ్యతలు నిర్హించారు. అంతకుముందు ఆమె కేబినెట్ మంత్రిగా పనిచేసారు. ఆగస్టు 6న ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరగనుండగా ఎన్డీయే, విపక్షాల ఉమ్మడి అభ్యర్థుల ఎంపిక పూర్తయ్యింది.
మంచి వక్తగా గుర్తింపు
కర్నాటకలోని మంగళూరులో 1942 ఏప్రిల్ 14న జన్మించిన మార్గరెట్ అల్వా పాఠశాల విద్య నుంచే మంచి వక్తగా పేరు గడించారు. విద్యార్థి ఉద్యమాలలో చురుకుగా పాల్గొన్నారు. క్రియాశీలక రాజకీయాల్లోకి రాకముందు ఆమె న్యాయవాద వృత్తిలో పనిచేశారు. 1974లో తొలిసారిగా కాంగ్రెస్ తరపున రాజ్యసభకు ఎన్నికైనారు. మొత్తంమీద ఆమె ఐదుసార్లు పార్లమెంట్లో ప్రాతినిధ్యం వహించారు. కేంద్రంలో పార్లమెంటరీ వ్యవహారాలు, యువజన వ్యవహరాల కేబినెట్ మంత్రిగా పనిచేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.