Monday, November 25, 2024

Followup : తెలంగాణలో 1,400 కోట్ల భారీ పెట్టుబడి పెట్టనున్న హ్యుండై..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి దక్కింది. ప్రముఖ కార్‌ల తయారీ దిగ్గజ కంపెనీ హ్యుందాయ్‌ రూ.1400 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. దావోస్‌లో జరుగుతున్న వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌(డబ్ల్యూఈఎఫ్‌) సమావేశాల్లో భాగంగా తెలంగాణ పెవిలియన్‌లో మంత్రి కేటీఆర్‌తో ఈ మేరకు సమావేశమైన హ్యుందాయ్‌ గ్రూప్‌ సీఐవో యంగ్చోచ్చి తెంగాణలో రూ.1400 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న మొబైల్‌ వ్యాలీలో ఈ పెట్టుబడి పెట్టనున్నట్లు తెలిపారు. కేవలం పెట్టుబడి పెట్టడమే కాకుండా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మొబిలిటీ వ్యాలీ కన్సార్టియంలో భాగస్వామిగా ఉండేందుకు సంస్థ అంగీకరించింది. టెస్ట్‌ ట్రాక్‌లతో పాట మొబిలిటీ క్లస్టర్‌ ఇకో సిస్టమ్‌లో అవసరం అయిన ఇతర మౌళిక వసతులను ఏర్పాటు చేయనునట్లు తెలిపారు. దీంతోపాటు తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ఉన్న ఇతర అవకాశాలపైన కూడా విస్తృతంగా చర్చించారు. తెలంగాణలో మొబిలిటీ రంగానికి హ్యుందాయ్‌ పెట్టుబడి గొప్ప బలాన్ని ఇస్తుందని మంత్రి కేటీఆర్‌ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. దేశంలో తొలిసారిగా ప్రత్యేకంగా ఒక మొబిలిటీ వ్యాలీని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని, ఇందులో భాగస్వామిగా ఉండేందుకు ముందుకు వచ్చిన హ్యుందాయ్‌ కంపెనీకి సంపూర్ణ సహకారం అందిస్తామని కేటీఆర్‌ తెలిపారు. హ్యుందాయ్‌ రాకతో తెలంగాణ రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు మొబిలిటీ రంగంలో వస్తాయన్న ఆశాభావాన్ని మంత్రి కేటీఆర్‌ వ్యక్తం చేశారు. హ్యుందాయ్‌తో ఒప్పందంలో మంత్రి కేటీఆర్‌ వెంట రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌ రంజన్‌ పలు విభాగాల డైరెక్టర్లున్నారు.

రూ.28 కోట్లతో జీఎమ్‌ఎమ్‌ ఫాడ్లర్‌ విస్తరణ…

అంతర్జాతీయంగా పేరొందిన గ్లాస్‌లైన్‌ తయారీ కంపెనీ జీఎమ్‌ఎమ్‌ ఫాడ్లర్‌ హైదరాబాద్‌లోని తయారీ యూనిట్‌ను విస్తరించనున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం 37 లక్షల డాలర్లు(రూ.28 కోట్ల)ను పెట్టుబడిగా పెట్టనున్నట్లు తెలిపింది. ఫార్మాకంపెనీలకు అవసరమయ్యే గ్లాస్‌ రియాక్టర్‌, ట్యాంక్‌, కాలమ్‌లను తయారు చేయనుంది. ఈ మేరకు జీఎమ్‌ఎమ్‌ ఇంటర్నేషనల్‌ సీఈవో థామస్‌ కెహ్ల్‌ మంత్రి కేటీఆర్‌తో డబ్ల్యూఈఎఫ్‌లో సమావేశమై చర్చించారు. భారత్‌లో తమ వ్యాపార ప్రణాళికలకు తొలి ప్రాధాన్యత హైదరాబాద్‌కే ఇస్తున్నట్లు ఈ సందర్భంగా కెహ్ల్‌ తెలిపారు. హైదరాబాద్‌ ఫార్మాసిటీలోనూ భాగస్వామ్యమవనున్నట్లు చెప్పారు. జీఎమ్‌ఎమ్‌ ప్రకటనపై మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు.

రూ.25 కోట్లతో టీబీ నిర్ధారణ కిట్లు తయారు చేయనున్న ఈఎంపీఈ డయాగ్నస్టిక్స్‌..

క్షయవ్యాధి(టీబీ) డయాగ్నస్టిక్స్‌ కిట్‌లను తయారు చేసే గ్లోబల్‌ ప్రొడక్షన్‌ ఫెసిలిటీని హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నట్లు ఈఎంపీఈ డయాగ్నస్టిక్స్‌ ప్రకటించింది. రూ.25 కోట్ల పెట్టుబడితో జీనోమ్‌ వ్యాలీలో ప్రారంభించే ఈ ఫెసిలిటీ కేంద్రంలో నెలకు 20 లక్షల టీబీ నిర్ధారణ కిట్‌లను తయారు చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈమేరకు డబ్ల్యూఈఎఫ్‌ సమావేశాల్లో భాగంగా ఈఎంపీఈ డయాగ్నస్టిక్స్‌ సీఈవో డాక్టర్‌ పవన్‌ అసలాపురం మంత్రి కేటీఆర్‌తో సమావేశమయ్యారు. 5 దేశాల్లో క్లినికల్‌ పరీక్షలు నిర్వహించిన తర్వాత హైదరాబాద్‌ను ఎంచుకున్నట్లు తెలిపింది. హైదరాబాద్‌లో తయారయ్యే కిట్‌లను ప్రపంచవ్యాప్తంగా విక్రయించనున్నారు. రానున్న రోజుల్లో మరో 50 కోట్ల పెట్టుబడి పెట్టి మొత్తం 150 మందికి ఉద్యోగాలు కల్పించనున్నట్లు తెలిపింది.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement