నంద్యాల జిల్లాలో ఘోర ప్రమాదం
భారీ వర్షాలకు నానిన పైకప్పు
నిద్రిస్తుండగా కుప్పకూలడంతో ప్రమాదం
ఇంటిల్లిపాదిని మింగేసిన మృత్యువు
కడపలో చదువుకుంటున్న మరో బాలిక
దత్తత తీసుకుంటానన్న ఎంపీ శబరి
ఆంధ్రప్రభ స్మార్ట్, చాగలమర్రి (నంద్యాల జిల్లా): నంద్యాల జిల్లాలో ఓ విషాద ఘటన జనం గుండెల్ని పిండేసింది. ఆదమరచి నిద్ర పోతున్న ఓ కుటుంబంలోని నలుగురిని మృత్యువు మింగేసింది. పొద్దు పొడవగానే ఓ కుటుంబం ఇంటి మిద్దె కింద సమాధి కావటంలో ఆ ఊరు గొల్లుమంది. ఈ దుర్ఘటనతో కుటుంబ సభ్యులు, బంధువులు పొగిలి పొగిలి కన్నీరు మున్నీరు అయ్యారు. సభ్య సమాజాన్ని కదలించిన ఈ ఘటన నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం చిన్న వంగలి గ్రామంలో చోటు చేసుకుంది. ఇటీవలి కురిసిన వర్షాలతో ఇంటి మట్టి మిద్దె నానిపోయింది. గురువారం అర్ధరాత్రి ఈ మట్టి మిద్దె అకస్మాత్తుగా కూలిపోయింది. అప్పటికే గాఢ నిద్రలోని నలుగురు కుటుంబ సభ్యులు మట్టి మిదె కింద నలిగి సజీవ సమాధి అయ్యారు.
నిద్రలోనే కన్నుమూశారు..
ఊరంతా అర్ధరాత్రి ఆదమరచి నిద్దరోతున్న తరుణంలో ఈ పేద కుటుంబాన్ని మృత్యువు కాటేసింది. ఒక్కసారిగా ఇంటి మట్టి మిద్దె కూలిపోయినా.. ఆ శబ్ధం ఊరి జనానికి వినపడలేదు. శుక్రవారం తెల్లవారు జామున ఇల్లు వాకిలి ఊడ్చే ఇరుగు పొరుగు మహిళలు కుప్ప కూలిన మట్టిమిద్దెను గమనించారు. ఒక్కసారిగా గొల్లుమన్నారు. ఊరు ఊరంతా ఉలిక్కిపడింది. ప్రమాద స్థలికి చిన్నాపెద్ద చేరుకున్నారు. వెంటనే శిథిలాలను తొలగించారు. మట్టి మిద్దె శిథిలాల కింద దంపతులు గురుశేఖర్ రెడ్డి (45), దస్తగిరమ్మ (38), ఇద్దరు కుమార్తెలు పవిత్ర (16), గురులక్ష్మి (10) మృతదేహాలను చూసి అల్లాడిపోయారు. అయిదుగురు సభ్యులున్న కుటుంబంలో నలుగురు మరణించడతో ఆ గ్రామంలో విషాద చాయలు అలముకున్నాయి. బంధువులు, కుటుంబ సభ్యులు రోదనలతో గ్రామమంతా కన్నీరుపెట్టింది. ఈ విషయాన్ని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఎంపీ శబరి దిగ్భ్రాంతి.. మరో బాలిక దత్తత
చిన్న వంగలిలో జరిగిన ఘోర ప్రమాదంపై నంద్యాల ఎంపీ శబరి చలించిపోయారు. ఘటనాస్థలికి వచ్చి ఆరా తీశారు. ఆ కుటుంబంలో మిగిలిన బాలిక.. గురుశేఖర్ రెడ్డి రెండో కుమార్తె ప్రసన్నను దత్తత తీసుకుంటున్నట్టు తెలిపారు. కాగా, ఆ బాలిక కడప జిల్లా ప్రొద్దుటూరు ఉషోదయ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. అక్కడే ఉండంతో ఈ ప్రమాదం నుంచి బయటపడిందని గ్రామస్తులు కన్నీరుపెట్టారు. ఆ బాలిక చదువు బాధ్యతలన్నీ తానే తీసుకుంటానని ఎంపీ శబరి తెలిపారు.