Friday, November 22, 2024

Followup – బెంగాల్ రైలు ప్రమాదంలో 8కి చేరిన మృతుల సంఖ్య ….

బెంగాల్ లో విషాదం…
రెండు రైళ్లు ఢీ
8 మంది దుర్మ‌ర‌ణం
50 మందికి పైగా గాయాలు
ఒకే ట్రాక్ పైకి రైలు – గూడ్స్
కాంచ‌న‌జంగా ఎక్స్ ప్రెస్ ను ఢీ కొన్న గూడ్స్
డార్జిలింగ్ జిల్లాల‌లో ఘ‌ట‌న

కోల్‌కతా: పశ్చిమబెంగాల్ లోని డార్జిలింగ్‌ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఒకే ట్రాక్‌ పైకి వచ్చిన రెండు రైళ్లు ఢీకొనడం తో ఓ బోగీ గాల్లోకి లేచింది. ఈ ప్రమాదంలో స్పాట్ లోనే అయిదుగురు చ‌నిపోగా, మ‌రో ముగ్గురు చికిత్స పొందుతూ క‌న్నుమూశారు..ఈ ప్ర‌మాదంలో 50 మందికి పైగా గాయ‌ప‌డ్డారు..

- Advertisement -

వివరాల‌లోకి వెళితే

అస్సాంలోని సిల్చార్‌ నుంచి కోల్‌కతా లోని సీల్దాకు బయల్దేరిన కాంచన్‌జంఘా ఎక్స్‌ప్రెస్ మధ్యలో న్యూజల్‌పాయ్‌గుడి వద్ద ఆగింది. అక్కడి నుంచి బయల్దేరిన కాసేపటికే రంగపాని స్టేషన్‌ సమీపంలో వెనక నుంచి ఓ గూడ్స్‌ రైలు దీన్ని బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు గూడ్స్‌ రైలు బోగీలు చెల్లాచెదురుగా పడిపోగా.. ఎక్స్‌ప్రైస్‌ రైలు రెండు బోగీలు పట్టాలు తప్పాయి. ఓ బోగీ గాల్లోకి లేవడం ప్రమాదం తీవ్రతకు అద్దంపడుతోంది. సమాచారమందుకున్న రైల్వే పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఘటనపై డార్జిలింగ్‌ అదనపు ఎస్పీ మాట్లాడుతూ, ఇప్పటికే 8 మంది ప్రయాణికులు మృతిచెందారని, మరో 51 మంది గాయపడ్డారని తెలిపారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. వీరిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

సిగ్నల్‌ దాటుకుని..
సిగ్నల్‌ జంప్‌ కారణంగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. రెడ్‌ సిగ్నల్‌ను వేసినా గూడ్స్‌ రైలు పట్టించుకోకుండా వెళ్లినట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి.

ఘటనపై సీఎం, రైల్వే మంత్రి దిగ్భ్రాంతి

ప్రమాదంపై రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనాస్థలంలో యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్‌, ఎస్పీ, వైద్యులు, అంబులెన్స్‌లు, విపత్తు నిర్వహణ బృందాలు వెంటనే అక్కడకు చేరుకున్నాయన్నారు. అటు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ దీనిపై స్పందించారు. ఇది తీవ్ర దురదృష్టకర ఘటన అని విచారం వ్యక్తం చేశారు. సహాయకచర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. కాగా, ప్రమాద స్థలానికి రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చేరుకున్నారు.. అక్కడ సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement