- ఎక్కువ మందితో మందు పార్టీ అయితే అనుమతి తప్పనిసరి
- ఆ పార్టీలో డ్రగ్స్ తీసుకుని చిక్కిన విజయ్ మద్దూరి
- తప్పులు మీరు చేసి మా ప్రభుత్వంపై నిందలా
- స్థానికులు ఫిర్యాదుతోనే ఫామ్ హౌజ్ పై దాడి
హైదరాబాద్: పార్టీలు, పండగల దావత్‌లకు ప్రభుత్వం వ్యతిరేకం కాదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రాజ్‌పాకాల జన్వాడ ఫాంహౌజ్ ఘటన మీద కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి స్పందిస్తూ… ఫామ్ హౌజ్ లలో, ఇళ్లలో, ఫంక్షన్ హాలులో పార్టీలు చేసుకోవచ్చన్నారు. అయితే కొన్ని నియమ, నిబంధనలు పాటించాలన్నారు.. ఎక్కువ మందితో మందు పార్టీలు చేస్తే ఎక్సైజ్ ఫీజు చెల్లించి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని గుర్తు చేశారు. విదేశీ మద్యం అయితే దానికి తగిన ఎక్సైజ్ డ్యూటీ చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు.
ఇక, అదే పార్టీకి హాజరైన విజయ్ మద్దూరికి కొకైన్ డ్రగ్స్ తీసుకున్నట్లుగా పాజిటివ్ రిపోర్ట్ ఎలా వచ్చిందని కేటీఆర్ ను ప్రశ్నించారు పొన్నం. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకే పోలీసులు జన్వాడ ఫామ్‌హౌస్ లో జరుగుతున్న పార్టీపై రెయిడ్స్ చేశారని పేర్కొన్నారు. తమ తప్పులు కప్పిపుచ్చుకునేందుకు తమపై అకారణంగా తమ సర్కార్‌పై బురదజల్లేందుకు బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. తాము ప్రభుత్వంలో ఉన్నప్పటికీ తమకు ఎవరిపైనా ఎలాంటి కక్ష సాధింపులు లేవన్నారు.
ప్రజల్లో అపోహలు కలిగించేలా కేటీఆర్ మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు పొన్నం. కేటీఆర్ బామ్మర్ది ఇంట్లో సోదాలకు సీఎం, మంత్రులకు ఏం సంబంధం అని ప్రశ్నించారు. ఫిర్యాదులు వస్తే అధికారులు వారి పని వారు చేస్తారన్నారు. దీన్ని కూడా బీఆర్‌ఎస్ రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం సిగ్గుచేటన్నారు.