హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణలో ప్రస్తుత రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)లో తయారీ రంగ వాటాను గణనీయంగా పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పరిశ్రమల శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇందుకోసం రాష్ట్రంలో తయారీకి సంబంధించి పెట్టుబడులకు ఎలాంటి అవకాశం ఉన్నా వదులుకోవడం లేదని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్ర జీఎస్‌డీపీలో సేవా రంగం సింహభాగం వాటా కలిగి ఉంది. దీంతో తయారీ రంగం వాటా పెంపుపై దృష్టి సారించి ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తున్నట్లు పరిశ్రమల అధికారులు చెబుతున్నారు.
ఈ క్రమంలోనే రాష్ట్రంలో తయారీ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడానికి ఇక్కడి ల్యాండ్ బ్యాంక్‌నే తాము ప్రధానంగా మార్కెటింగ్ చేస్తున్నట్లు వారు పేర్కొంటున్నారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు ప్రస్తుతం 2 లక్షల ఎకరాల ల్యాండ్ బ్యాంక్ సిద్ధంగా ఉందని, దీనిలో 80వేల ఎకరాల భూములు రాజధాని హైదరాబాద్ చుట్టు పక్కల ప్రాంతాల్లో మంచి కనెక్టివిటీ, నీటి సరఫరా సదుపాయం కలిగినవి అందుబాటులో ఉన్నాయని అధికారులు పేర్కొంటున్నారు. ఇదే విషయాన్ని ప్రధానంగా తాము మార్కెటింగ్ చేస్తున్నామని, అతి తక్కువ ధరకు అన్ని వసతులు కలిగిన భూమిని కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నామని పెట్టుబడిదారులకు స్పష్టం చేస్తున్నట్లు చెబుతున్నారు.
కరోనా తర్వాత చైనాను వీడుతున్న కంపెనీలపై దృష్టి…
కరోనా సంక్షోభం తలెత్తిన తర్వాత మెటల్, కెమికల్, ఫార్మా, టెక్స్‌టైల్ రంగాలకు చెందిన పలు కంపెనీలు చైనాను వీడుతుండడంతో వాటికి ఆసియాలో మరో పెట్టుబడి గమ్యస్థానంగా భారత్ మారింది. చైనాను వీడుతున్న కంపెనీలు భారత్‌కు క్యూ కడుతున్నాయని ఇటీవల ప్రధాని మోడీ ప్రకటించినప్పటి నుంచి తెలంగాణ పరిశ్రమల శాఖ క్రియాశీలకంగా వ్యవహరిస్తోంది. చైనా నుంచి వలస వచ్చే కంపెనీలకు కేటాయించడానికి తమ వద్ద అన్ని సదుపాయాలు కలిగిన భూములు విస్తృతంగా అందుబాటులో ఉన్నాయని కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖకు రాష్ట్ర పరిశ్రమల శాఖ ఇప్పటికే నివేదిక ఇచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.
రాజధాని హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి 100 కి.మీల రేడియస్‌లో 80 వేల ఎకరాలు పరిశ్రమలకు కేటయించడానికి సిద్ధంగా ఉన్నామని ఈ నివేదికలో పొందుపరిచినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఈ భూముల్లోనూ 30 శాతానికిపైగా భూములు మైదాన ప్రాంతంలో ఉన్నవే అయినందున అభివృద్ధి చేసుకునేందుకు పెద్దగా వ్యయం చేయాల్సిన అవసరం ఉండదని నివేదికలో తెలిపారు.
పరిశ్రమలు నెలకొల్పేందుకు సంబంధించి అన్ని అనుమతులివ్వడానికి టీఎస్‌ఐపాస్ పేరుతో సింగిల్ విండో పద్ధతిని అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. దీనికి తోడు రాష్ట్రం సరళతర వ్యాపార విధానాల(ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్)లో ఎప్పుడూ అగ్రస్థానంలోనే ఉంటుందన్న విషయాన్ని కూడా నివేదికలో ప్రధానంగా పొందుపరిచినట్లు అధికారులు పేర్కొంటున్నారు. టీఎస్‌ఐపాస్ అమలులోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలోకి 30 బిలియన్ డాలర్లకుపైగా పెట్టుబడులు వచ్చినట్లు తెలిపారు.
ఫలిస్తున్న కంపెనీ టు కంపెనీ వ్యూహం…
రాష్ట్రంలో తయారీ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడానికిగాను తాము ప్రత్యేకంగా కంపెనీ టు కంపెనీ వ్యూహాన్ని అవలంబిస్తున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ చెబుతోంది. సాధారణంగా కొన్ని రాష్ట్రాలు పెద్ద పెద్ద ఈవెంట్లు నిర్వహించి పెట్టుబడులను ఆకర్షిస్తుంటాయని అయితే తాము నేరుగా కంపెనీలతోనే టచ్‌లోకి వెళ్లి వారికి కావాల్సిన మౌలిక సదుపాయాలు, రాయితీలపై వివరంగా చర్చించి ఆఫర్ ఇస్తున్నామని పరిశ్రమల శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
తెలంగాణలో ఒకసారి పెట్టుబడి పెట్టిన కంపెనీలే తమకు మరిన్ని పెట్టుబడులు తీసుకురావడానికి సంబంధించి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాయని అన్నారు. ఇటీవల రాష్ట్రానికి వచ్చిన యంగ్‌వన్, కిటెక్స్, ట్రైటాన్ లాంటి తయారీ రంగానికి సంబంధించిన భారీ పెట్టుబడులన్నీ తాము స్వయంగా సంప్రదించి తీసుకొచ్చినవేనని సదరు అధికారి తెలిపారు. రానున్న రోజుల్లో తయారీ రంగాన్ని పరుగులు పెట్టించి భారీ ఎత్తున ఉపాధి కల్పనకు కృషి చేయడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.