Monday, November 25, 2024

Delhi | ఇండియా కూటమిలో లుకలుకలు.. జేడీ(యూ) రామ్ రామ్?

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: భారతీయ జనతా పార్టీ (బీజేపీ)ని ఓడించడమే ఏకైక లక్ష్యంగా జట్టుకట్టిన విపక్ష కూటమి (ఇండియా)లో లుకలుకలు తీవ్రమయ్యాయి. ఇప్పటికే ఒంటరిగా పోటీ చేస్తామంటూ తృణమూల్ అధినేత్రి మమత బెనర్జీ, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించగా.. తాజాగా విపక్ష కూటమిని పాట్నా మీటింగ్ ద్వారా ఏకతాటిపైకి తెచ్చిన జనతాదళ్ (యునైటెడ్) అధినేత, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సైతం కూటమికి ‘రాంరాం’ చెప్పి మరోసారి ఎన్డీఏ కూటమిలో చేరనున్నట్టు సంకేతాలు ఇస్తున్నారు.

2013 నుంచి ఇప్పటి వరకు ఎన్డీఏను వీడి మహాకూటమిలో చేరడం, కూటమిని వీడి ఎన్డీఏలో చేరడం పరిపాటిగా మారింది. మళ్లీ తాజాగా లోక్‌సభ ఎన్నికలకు ముందు బిహార్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలు మరోసారి యావద్దేశం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. మొత్తంగా రాష్ట్ర అసెంబ్లీనే రద్దు చేసి, లోక్‌సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలకు సైతం సిద్ధపడాలన్న ఆలోచనలో నితీశ్ కుమార్ ఉన్నట్టుగా తెలుస్తోంది.

- Advertisement -

ఈ క్రమంలో ముందుగా రాజీనామా చేసి బీజేపీ మద్ధతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని, ఆ తర్వాత కేబినెట్ తీర్మానం ద్వారా ప్రభుత్వాన్ని రద్దు చేసి లోక్‌సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధపడాలని చూస్తున్నారు. అలాగే ఫిబ్రవరి 4న బిహార్‌లోని బెత్తియాలో జరగనున్న సభలో ప్రధానితో వేదికను పంచుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మొత్తం 243 మంది సభ్యులున్న బిహార్ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కనీసం 122 మంది ఎమ్మెల్యేల మద్ధతు అవసరం.

రాష్ట్రీయ లోక్‌దళ్‌ (ఆర్జేడీ)కి 79 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మహాకూటమి నుంచి బయటపడితే బీజేపీకి ఉన్న 82 సీట్లతో పాటు తన 45 సీట్లు కలుపుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు. మరోవైపు నితీశ్ పునరాగమనం కోసం బీజేపీ కూడా రంగం సిద్ధం చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే రాష్ట్ర నాయకత్వానికి కేంద్ర నాయకత్వం నుంచి కీలక ఆదేశాలు వెళ్లాయి. ఆ ప్రకారం ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌పై విమర్శలు చేయవద్దంటూ జాతీయ నాయకత్వం సూచించింది.

మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సామ్రాట్ చౌదరిని ఢిల్లీకి రావాలంటూ అధిష్టానం నుంచి పిలుపు అందింది. ఆయనతో పాటు పార్టీ సీనియర్ నేత సుశీల్ మోదీ కలిసి జాతీయ నాయకత్వంతో మంతనాలు సాగించనున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ – జేడీ(యూ) కలసి పోటీ చేయగా.. బిహార్‌లోని 40 స్థానాలకు గాను అత్యధికంగా 39 సీట్లలో పాగా వేసింది. ఈసారి కూడా జేడీ(యూ) లేకుండా బీజేపీ అన్ని సీట్లు సాధించే అవకాశం లేదు. అందుకే బీజేపీ వైపు నుంచి కూడా నితీశ్‌కు సానకూల స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

లాలూ కుటుంబంపై విమర్శలు

బిహార్ సీఎం నితీశ్ కుమార్ గురువారం మాజీ సీఎం, భారతరత్న పురస్కారానికి ఎంపికైన సోషలిస్ట్ నేత కర్పూరి ఠాకూర్ జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ సభలో కీలక వ్యాఖ్యలు చేశారు. కర్పూరి ఠాకూర్ వారసత్వ రాజకీయాలను తీవ్రంగా వ్యతిరేకించారని గుర్తుచేస్తూ.. రాష్ట్రంలో కొందరు మాత్రం వారసత్వ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. తాను మాత్రం కర్పూరి ఠాకూర్ బాటలో తన కుటుంబ సభ్యులెవరినీ రాజకీయాల్లోకి రాకుండా చేశానని చెప్పారు. ఈ వ్యాఖ్యలు లాలూ కుటుంబాన్ని ఉద్దేశించి చేసినవని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నితీశ్ వ్యాఖ్యలకు కౌంటర్‌గా లాలూ కుమార్తె సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం దుమారానికి తెరలేపినట్టయింది. గత కొద్ది కాలంగా జేడీ(యూ), ఆర్జేడీ పార్టీల మధ్య విబేధాలు ముదురుతూ వచ్చాయి. ఇప్పుడు అవి తెగదెంపుల దశకు చేరుకున్నాయి. అయితే నితీశ్ వ్యవహారశైలి మాత్రం నిలకడలేనితనానికి ఉదాహరణగా మారింది. 2013 నుంచి ఇప్పటి వరకు ఆయన ఎన్డీఏ క్యాంపు నుంచి బయటకు వెళ్లి, మళ్లీ వచ్చి, మళ్లీ వీడి బయటకు వెళ్లి.. ఇలా మొత్తంగా 5 పర్యాయాలు అటూ ఇటూ మారుతూ వచ్చారు. ఈ క్రమంలో సీఎం పదవిని మాత్రం కాపాడుకుంటూ వచ్చారు.

ప్రభావం చూపిన అయోధ్య రామమందిరం, భారతరత్న

బిహార్‌ రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న తాజా పరిణామాలకు అయోధ్యలో ప్రారంభమైన రామజన్మభూమి ఆలయంతో పాటు బిహార్ జన నేతగా పేరుగాంచిన సోషలిస్ట్ నేత, మాజీ సీఎం కర్పూర్ ఠాకూర్‌కు భారతరత్న ప్రకటించడం కారణాలుగా కనిపిస్తోంది. రామాలయ ప్రారంభం తర్వాత ఉత్తరాదిన ముఖ్యంగా హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా హిందూ వ్యతిరేకులుగా ముద్ర పడుతోంది. ఈ పరిస్థితుల్లో హిందువుల ఓట్లు దూరం చేసుకునే ప్రమాదం ఉందని నితీశ్ గ్రహించినట్టు తెలుస్తోంది. మరోవైపు బిహార్ జననేత కర్పూరి ఠాకూర్‌కు భారతరత్న ఇవ్వడం వల్ల ఆ రాష్ట్రంలో బీజేపీ మరికొంత పుంజుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ పరిస్థితులను బేరీజు వేసుకున్న తర్వాతనే నితీశ్ తాజాగా యూ-టర్న్ తీసుకున్నారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement