దేశవ్యాప్తంగా పెరుగుతున్న ఫ్లూ లక్షణాలపై ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ డా. రణదీప్ గులేరియా హెచ్చరికలు జారీచేశారు. హఠాత్తుగా పెరుగుతున్న జ్వరం, దగ్గు కేసులకు ‘ఇన్‌ప్లnూయెంజా ఎ ఉపరకం హెచ్3ఎన్2’ వైరస్ ప్రధాన కారణమని పేర్కొన్నారు. ఈమేరకు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) ప్రకటనను గుర్తుచేశారు. ఈ వైరస్ కొవిడ్‌లా వ్యాపిస్తోంది. గాల్లో తుంపర్ల ద్వారా వ్యాపించే ఈ వైరస్ ఏటా వేసవికి ముందు మార్పులకు లోనవుతుంది. దీన్ని యాంటీజెనిక్ డ్రిప్ట్ అంటారు. గతంలో వచ్చిన హెచ్1ఎన్1 వైరస్ ఇప్పుడు హెచ్3ఎన్2గా రూపాంతరం చెందింది. రోగ నిరోధక శక్తి తగ్గడం వల్లే జనం సులభంగా ఈ వైరస్ ఇన్‌ఫెక్షన్ బారిన పడుతున్నారు. ఈ వైరస్ బారిన పడిన వారిలో జ్వరం, దగ్గు, గొంతులో గరగర, ఒళ్లు నొప్పులు, ముక్క కారడం వంటి ప్రాథమిక లక్షణాలు కనిపిస్తాయి. పెద్దలు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, దీర్ఘకాలిక రోగులు, శ్వాససంబంధ వ్యాధి గ్రస్తులు జాగ్రత్తగా ఉండాలి అని గులేరియా సూచించారు.
అయితే, ఇదేమంత ఆందోళనకరమైన అంశం కాదని, కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్యలో భారీ పెరుగుదల లేదని స్పష్టం చేశారు. వాతావరణ మార్పుల కారణంగా హెచ్3ఎన్2 సహజంగానే మార్పులకు లోనవతుంటుందని చెప్పుకొచ్చారు. అయితే, కొవిడ్ మాదిరిగానే హెచ్3ఎన్2 వైరస్ వ్యాప్తి చెందుతోందని, మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి అలవాట్లు తగ్గడంతో ఇన్‌ప్లూయెంజా కేసులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వైరస్ బారిన పడకుండా ఉండేందుకు మాస్కులు ధరించాలని, తరచూ చేతులను శుభ్రపరుచుకోవాలని డాక్టర్ రణదీప్ గులేరియా సూచించారు.
బెంగాల్‌లో ఎడినోవైరస్.. 19 మంది చిన్నారులు మృతి..
గత రెండు నెలలుగా కోల్‌కతాలోని చిన్నారుల్లో దగ్గు, జలుపు, శ్వాసకోశ సంబంధిత కేసులు పెరుగుతున్నాయి. రెండేళ్లలోపు చిన్నారుల్లో తీవ్రమైన గురక సమస్య తలెత్తుతోంది. వీరిలో కొందరికి వెంటిలేటర్లపై చికిత్స అందించాల్సి వస్తోంది. శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్ బారినపడి ఇప్పటివరకు 19మంది చిన్నారులు మత్యువాత పడ్డారు. జనవరిలో పశ్చిమబెంగాల్‌లో 500 మంది అనుమానితుల శాంపిల్స్‌ను పరీక్షించారు. 33శాతం నమూనాల్లో అడినో వైరస్ లక్షణాలను గుర్తించారు. ఈ పరిస్థితిపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోగ్యవిభాగం అధికారులు, సిబ్బందిని అప్రమత్తం చేశారు. సెలవులు రద్దు చేస్తూఆదేశాలు జారీ చేశారు. అందరూ విధులకు హాజరవ్వాలని, ఫీవర్ క్లినిక్‌లు నిరంతర సేవల్లో ఉండాలని కోరారు. ఆక్యూట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ మూలంగా చిన్నారులు మరణించారని, వీరిలో ఆరుగురు ఎడినోవైరస్ బాధితులేనని నివేదికలు వెల్లడించాయి. ఈ ముప్పును ఎదుర్కొనేందుకు మాస్కులు ధరించడం తప్పనిసరి అని దీదీ కోరారు.