Friday, November 22, 2024

సిడ్నీకి జలగండం, 18 నెలల్లో నాలుగు ప్రళయాలు.. అందాల నగరం ఇక నీట మునక

ఆస్ట్రేలియాలోని అందాల నగరంగా బాసిల్లుతున్న సిడ్నీ జలదిగ్బందంలో చిక్కుకోనుంది. తరచూ వరదల్లో మునుగుతున్న సిడ్నీ ఆగ్నేయ ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్‌ వేల్స్‌ రాష్ట్రం గత 18 నెలల్లో నాలుగు భయంకరమైన జల ప్రళయాలను చూసింది. పెరుగుతున్న వాతావరణ మార్పులకు భౌగోళిక పరిస్థితులు ఆజ్యం పోయడంతో సిడ్నీ వాసులు వరదల తాకిడి నుంచి కోలుకోలేకపోతున్నారు. ఆస్ట్రేలియా వరదలు కేవలం స్థానికులకు మాత్రమే ఆందోళన కరం కాదు. అవి ప్రపంచానికే ఓ హెచ్చరిక..!

ఆస్ట్రేలియాలోనే అత్యధిక వరదముప్పు పొంచి ఉన్న ప్రాంతం న్యూ సౌత్‌ వేల్స్‌. ఇక్కడ ప్రవహించే హాక్స్‌బరి-నెపియన్‌ నది వరద అంత వేగంగా బయటకు వెళ్లకుండా భౌగోళిక పరిస్థితులు నెలకొన్నాయి. విండో సోర్‌, రిచ్‌మాండ్‌, ఈమూ ప్లెయిన్స్‌, పాన్‌ రిత్‌, బ్లాక్‌ టౌన్‌ వంటి ప్రాంతాలు ఈ నది వరదకు అనుకూలంగా ఉంటాయి. వీటిల్లో చాలావరకు ద్వీపాల వలే నీరు చుట్టుముట్టి ఉంటాయి. ఇక్కడే ‘సాక్‌ విల్లె బాత్‌టబ్‌ ‘ అనే లోతట్టు ప్రాంతంలో దాదాపు 18 వేల మంది నివసిస్తున్నారు. రిచ్‌మాండ్‌ నుంచి సాక్‌ విల్లే మధ్య ఉన్న ప్రదేశం ఇది. వరదల సమయంలో ఈ ప్రదేశం తీవ్రంగా ప్రభావితమౌతుంది. దీనిలో పశ్చిమ సిడ్నీకి చెందిన కుంబర్లాండ్‌ ప్లెయిన్లు కూడా భాగమే. దాదాపు 100 మిలియన్ల సంవత్సరాల పాటు జరిగిన భౌగోళిక మార్పులో భాగంగా ఏర్పడ్డ తొట్టె వంటి ప్రదేశం చుట్టూ నిట్ట నిలువు భూ భాగాలు ఉంటాయి. ఇక్కడి నుంచి హాక్స్‌ బరి- నెపియన్‌ నది ఇరుకైన భారీ ఇసుక శిలల మధ్య నుంచి ప్రవహిస్తుంది. ఈ ప్రదేశం కారణంగా సాక్‌ విల్లె బాత్‌ టబ్‌ నుంచి వేగంగా వరద బయటకు పోలేదు. సాక్‌ విల్లె బాత్‌ టబ్‌కు దాదాపు ఐదు ప్రవాహాల నుంచి నీరు చేరుతుంది. అదే సమయంలో బయటకు వెళ్లే మార్గాలు ఇరుకైపోయాయి. మరో వైపు సిడ్నీ వేగంగా విస్తరిస్తుండటంతో ముంపు ప్రాంతాల్లో కూడా నిర్మాణాలు చోటు చేసుకుంటున్నాయి.

భారత్‌పై ప్రతికూల ప్రభావం..

బొగ్గు ఉత్పత్తిలో అత్యంత కీలక పాత్ర పోషించే ఆస్ట్రేలియా ఇప్పుడు విద్యుత్‌ సంక్షోభం అంచున కొట్టుమిట్టాడుతోంది. అవకాశం ఉంటే నిత్యం కొంత సేపు లైట్లు ఆర్పేయమని న్యూ సౌత్‌ వేల్స్‌ రాష్ట్ర ప్రజలను ఇటీవల ఆస్ట్రేలియా ఇంధన శాఖ మంత్రి క్రిస్‌ బొవెన్‌ స్వయంగా అభ్యర్థించారు. సిడ్నీ నగరంలో కూడా ఇలా చేయాలని కోరడం పరిస్థితికి అద్దం పడుతోంది. ఈ ఏడాది ప్రారంభంలో ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌, న్యూ సౌత్‌ వేల్స్‌లో భారీగా వరదలొచ్చాయి. ఈ ప్రాంతాల్లో బొగ్గు గనులు ఎక్కువ. వరదల కారణంగా గనులు, బొగ్గు సరఫరా చేసే రైల్వే లైన్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. సరఫరాలు లేక బొగ్గు ఉత్పత్తి చేసే సామర్ధ్యంలో 25 శాతం ఖాళీగా ఉంచాల్సి వస్తోంది. ఇప్పుడు మరోసారి వరదలు రావడంతో బొగ్గు ఉత్పత్తి గణనీయంగా పడిపోయే ప్రమాదం ఉంది. ఈ కారణంగా భారత్‌లో ఇప్పటికే విద్యుత్‌ ఉత్పత్తి జూన్‌- సెప్టెంబర్‌ వరకు పవర్‌ ప్లాంట్ల అవసరాలకు సరిపడా బొగ్గు నిల్వలను సమీకరించడం కష్టతరంగా మారనుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement