సిక్కింలో క్లౌడ్‌బరస్ట్ కారణంగా తీస్తా నదిలో వరదలు పోటెత్తాయి. దాంతో కనీసం 23 మంది ఆర్మీ సిబ్బంది, 20 మంది పౌరులు అదృశ్యమయ్యారు. వీరి ఆచూకీ కోసం అన్వేషణ ప్రారంభించామని అటు ప్రభుత్వంతోపాటు సైన్యం ప్రకటనచేసింది. లాచెన్ లోయ వెంబడి ఉన్న కొన్ని సంస్థలు ప్రభావితమైనట్లు ఆర్మీ ఈస్టర్న్ కమాండ్ ఒక ప్రకటనలో తెలిపింది.
”చుంగ్తాంగ్ డ్యామ్ నుండి నీటిని విడుదల చేయడం వల్ల దిగువకు 15-20 అడుగుల ఎత్తు వరకు నీటి మట్టం అకస్మాత్తుగా పెరిగింది. ఇది సింగ్టామ్ సమీపంలోని బర్దాంగ్ వద్ద పార్క్ చేసిన ఆర్మీ వాహనాలను ముంచెత్తింది. 23 మంది సిబ్బంది, కొన్ని వాహనాలు ప్రవాహంలో కొట్టుకునిపోయాయి. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి”అని సదరు ప్రకటన పేర్కొంది.
సిక్కింలో మంగళవారం రాత్రంతా భారీ వర్షం కురిసింది. ఉత్తర సిక్కింలోని లొనాక్ సరస్సుపై మేఘాల విస్ఫోటనం కారణంగా అది పొంగి ప్రవహించి తీస్తా నదిలో నీటి మట్టాలు పెరిగాయి. తీస్తా నది బంగ్లాదేశ్‌లోకి ప్రవేశించే ముందు సిక్కిం, పశ్చిమ బెంగాల్ గుండా ప్రవహిస్తుంది.
వరద పరిస్థితిపై ప్రధాని మోడీ స్పందించారు. తాను సిక్కిం ముఖ్యమంత్రితో మాట్లాడానని, ఆదుకుంటానని హామీ ఇచ్చానని తెలిపారు. సిక్కిం అడ్మినిస్ట్రేషన్ నివాసితులకు హై అలర్ట్ ప్రకటించింది. స్థానిక నివాసితులు రికార్డ్ చేసి, షేర్ చేసిన వీడియోలు వైరల్‌గా మారాయి. ఉదృత ప్రవాహాలు.. దెబ్బతిన్నరోడ్ల వీడియోలు వరద పరిస్థితిని కళ్లకు కట్టాయి.
అయితే, ఎవరూ గాయపడలేదని, భారీగా ఆస్తినష్టం వాటిల్లిందని అధికారులు తెలిపారు. సింగ్‌టామ్‌లో కూడా కొంతమంది తప్పిపోయినట్లు సమాచారం. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి అని ముఖ్యమంత్రి ప్రేమ్‌సింగ్ తమాంగ్ బాధిత ప్రాంతాన్ని సందర్శించిన సందర్భంగా చెప్పారు.