Tuesday, November 26, 2024

Floods – హిమాచల్‌ప్రదేశ్‌లో క్లౌడ్‌బరస్ట్ – వరదలో కొట్టుకుపోయిన గ్రామం

వరదలకు తుడిచిపెట్టుకుపోయిన సమేజ్ గ్రామం
అక్కడ మిగిలింది కేవలం ఒక్క ఇల్లు మాత్రమే
మేఘ విస్ఫోటనంతో జల విలయం
మెరుపు వరదలతో 53 గల్లంతు
60 ఇళ్లు కొట్టుకుపోయి ఉంటాయని అంచనా
వెల్లడించిన డిజాస్టర్​ మేనేజ్​మెంట్​ అధికారులు

ఆంధ్రప్రభ స్మార్ట్ – హిమాచల్ ప్రదేశ్‌లో ఇటీవల విలయం సృష్టించిన ‘మేఘ విస్ఫోటనం’ (క్లౌడ్ బరస్ట్) ఒక గ్రామాన్ని సమూలంగా తుడిచిపెట్టేసింది. మెరుపు వరదల్లో సమేజ్ అనే గ్రామం మొత్తం కొట్టుకుపోయింది. కేవలం ఒకే ఒక్క ఇల్లు మాత్రమే మిగిలి ఉంది. హృదయాన్ని కలచివేసే ఈ విషాద ఉదంతాన్ని అదే గ్రామానికి చెందిన అనితా దేవి వివరించింది. బుధవారం రాత్రి తమ కుటుంబ సభ్యులంతా నిద్రిస్తున్న సమయంలో పెద్ద శబ్దం వచ్చిందని, తమ ఇల్లు కదిలిపోయిందని ఆమె చెప్పింది. తాము బయటకు వెళ్లి చూడగా ఊరు మొత్తం కొట్టుకుపోయిందని విలపించింది. వెంటనే గ్రామంలోని భగవతి కాళీ మాత ఆలయానికి పరిగెత్తుకెళ్లి రాత్రంతా అక్కడే గడిపామని చెప్పింది. వర్షం విధ్వంసం నుంచి తమ ఇల్లు మాత్రమే బయటపడిందని, కానీ, ఇంట్లోని వస్తువులన్నీ కళ్ల ముందే కొట్టుకుపోయాయని చెప్పింది. ఇప్పుడు తాము ఎవరితో కలిసి జీవించాలో తెలియడంలేదని కన్నీరు పెట్టింది.

అందరూ వరదల్లో కొట్టుకుపోయారు..

సమేజ్ గ్రామానికే చెందిన బక్షి రామ్ అనే వృద్ధుడు కన్నీటి పర్యంతమవుతూ తన బాధ వెల్లడించాడు. ‘‘నా కుటుంబానికి చెందిన దాదాపు 14 నుంచి 15 మంది వరదలో కొట్టుకుపోయారు. రాంపూర్‌ అనే ఊరిలో ఉన్న నాకు తెల్లవారుజామున వరదలకు సంబంధించిన సమాచారం అందింది. ఆ సమయంలో వెళ్లలేక 4 గంటలకు గ్రామానికి వచ్చాను. నాకు ఆప్యాయతను పంచే కుటుంబ సభ్యుల కోసం ప్రస్తుతం వెతుకుతున్నా. ఎవరైనా ప్రాణాలతో బతికి ఉంటారేమోనన్న ఆశతో ఎదురుచూస్తున్నా’’ అని ఆ పెద్దాయన కన్నీళ్లు పెట్టుకున్నారు.

- Advertisement -

మెరుపు వరదలే కారణం.. 53 మంది గల్లంతు

కాగా, డిస్ట్రిక్ట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ తెలిపిన వివరాల ప్రకారం.. క్లౌడ్ బరస్ట్ కారణంగా ఏర్పడిన మెరుపు వరదల ప్రభావంతో హిమాచల్ ప్రదేశ్‌లోని కులు, మండి, సిమ్లా ప్రాంతాల్లో మొత్తం 53 మంది తప్పిపోయారని తేల్చారు. ఇందులో కేవలం ఆరుగురి మృతదేహాలను మాత్రమే స్వాధీనం చేసుకున్నారు. ఇక వరదల కారణంగా 60కి పైగా ఇళ్లు కొట్టుకుపోయాయని, పలు గ్రామాలు తీవ్రంగా నష్టపోయాయని డిస్ట్రిక్ట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ ప్రత్యేక కార్యదర్శి డీసీ రాణా వెల్లడించారు.

మేఘాల విస్పోటనం.. మెరుపు వరదలు..

అతి స్వల్ప సమయంలో భారీ వర్షాలు కురవడాన్నే మేఘాల విస్ఫోటనం లేదా క్లౌడ్‌బరస్ట్‌‌గా పిలుస్తారు. 20 నుంచి 30 చదరపు కిలోమీటర్ల పరిధిలో గంటకు 10 సెంటీమీటర్ల (100మి.మీ) వర్షపాతం నమోదవుతుంది. ఒక్కోసారిగా ఊహించని స్థాయిలో కురిసే ఈ భారీ వర్షాలు మెరుపు వరదలకు దారితీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement