Sunday, November 3, 2024

Telangana: మూసీకి పోటెత్తిన వ‌ర‌ద‌, మూసారాంబాగ్ బ్రిడ్జి మూసివేత.. అడ్డాకుల‌లో అత్య‌ధిక వ‌ర్ష‌పాతం!

బంగాళాఖాతంలో ఏర్ప‌డ్డ వాయుగుండం ప్ర‌భాంతో హైద‌రాబాద్ సిటీ వ్యాప్తంగా భారీ వ‌ర్షం కురుస్తోంది. దీంతో మూసీ న‌దికి మ‌రోసారి వ‌ర‌ద పోటెత్తింది. ఈ నేప‌థ్యంలో మూసారాంబాగ్ బ్రిడ్జి వ‌ద్ద మూసీ ఉధృతంగా ప్ర‌వ‌హిస్తుండ‌డంతో బ్రిడ్జి మునిగిపోయింది. మూసారాంబాగ్ బ్రిడ్జి పై నుంచి వ‌ర‌ద నీరు ప్ర‌వ‌హిస్తుండ‌టంతో రాక‌పోక‌లు నిలిచిపోయాయి. కాగా, ఈ ప్రాంతం నుంచి ట్రాఫిక్‌ను వేరే మార్గాల్లో మ‌ళ్లించారు. ముసారాంబాగ్ బ్రిడ్జిని మూసివేయ‌డంతో వాహ‌న‌దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఇక చాదర్‌ఘాట్ బ్రిడ్జి నుంచి న‌ల్ల‌గొండ ఎక్స్ రోడ్డు వ‌ర‌కు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్ప‌డింది. వాహ‌నాలు నెమ్మ‌దిగా క‌దులుతున్నాయి. అవ‌స‌ర‌మైతేనే ఇంట్లో నుంచి బ‌య‌ట‌కు రావాల‌ని న‌గ‌ర వాసుల‌కు పోలీసులు సూచిస్తున్నారు. మెహిదీప‌ట్నం, గోషామ‌హ‌ల్, మంగ‌ళ్‌హాట్‌, ఆసిఫ్‌న‌గ‌ర్‌, జియాగూడ‌, పురానాపూల్, బ‌హ‌దూర్ పురా, ఫ‌ల‌క్‌నూమా, చాంద్రాయ‌ణ‌గుట్ట‌, అఫ్జ‌ల్‌గంజ్, ల‌క్డీకాపూల్, నాంప‌ల్లి, పంజాగుట్ట‌, అమీర్‌పేట‌, ఖైర‌తాబాద్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, హైటెక్ సిటీ, మాదాపూర్, కొండాపూర్, సికింద్రాబాద్, కూక‌ట్‌ప‌ల్లి, బాలాన‌గ‌ర్, బోయిన్‌ప‌ల్లి, శేరిలింగంప‌ల్లి, చిల‌కల‌గూడ‌, తిరుమ‌ల‌గిరి, మారేడుప‌ల్లి, ప్యాట్నీ సెంట‌ర్, బేగంపేట్, సోమాజిగూడ‌, రాంన‌గ‌ర్, తార్నాక‌, ఓయూ, అంబ‌ర్‌పేట‌, దిల్‌సుఖ్‌న‌గ‌ర్, ఎల్బీన‌గ‌ర్, మ‌ల‌క్‌పేట‌తో పాటు ప‌లు ప్రాంతాల్లో వాన దంచికొట్టింది.

ఇక తెలంగాణ వ్యాప్తంగా భారీ వ‌ర్షాలు కురుస్తున్న‌ట్టు అధికారిక స‌మాచారం అందుతోంది. రాష్ట్రంలో ఇవ్వాల (బుధ‌వారం) అత్య‌ధిక వ‌ర్ష‌పాతం మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా అడ్డాకుల‌లో కురిసింది. అడ్డాకుల‌లో 97.3 మి.మీ వ‌ర్ష‌పాతం న‌మోదైన‌ట్టు అధికారులు తెలిపారు. ఆ త‌ర్వాత జ‌న‌గామ జిల్లా కొడ‌కండ్ల (89.1), న‌ల్గ‌గొండ జిల్లా వేముల‌ప‌ల్లి (80.7), నాగ‌ర్‌క‌ర్నూల్ జిల్లా ఆమ్ర‌బాద్ )79.7), యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా గుండాల‌లో (70.7) మి. మీట‌ర్ల అత్య‌ధిక వ‌ర్ష‌పాతం న‌మోదైంది.

కాగా, కుమ్రంభీం, మంచిర్యాల‌, నిర్మ‌ల్‌, నిజామాబాద్‌, సిద్దిపేట‌, మెద‌క్‌, సంగారెడ్డి, మేడ్చ‌ల్ మ‌ల్కాజిగిరి, రంగారెడ్డి, నారాయ‌ణ‌పేట‌, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, వ‌న‌ప‌ర్తి, జోగుళాంబ గ‌ద్వాల్‌, నాగ‌ర్‌క‌ర్నూల్‌, న‌ల్ల‌గొండ‌, యాదాద్రి భువ‌న‌గిరి, సూర్యాపేట‌, వ‌రంగ‌ల్‌, జ‌న‌గామ‌, భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాల్లో మోస్త‌రు వ‌ర్షం కురిసిన‌ట్టు హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం అధికారులు తెలిపారు. అదేవిధంగా జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి, ములుగు, జ‌న‌గామ‌, క‌రీంన‌గ‌ర్‌, జ‌గిత్యాల‌, రాజ‌న్న సిరిసిల్ల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలిక‌పాటి జ‌ల్లులు కురిసిన‌ట్టు స‌మాచారం.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement