Friday, November 22, 2024

విజయవాడ- హైదరాబాద్ జాతీయ రహదారిపై వరద నీరు.. స్తంభించిన రాకపోకలు

అమరావతి, ఆంధ్రప్రభ : ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల వల్ల జనజీవనం అతలాకుతలం అవుతోంది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. మున్నేరు, వైరా ఏరు, కట్లేరు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. విజయవాడ – హైదరాబాద్‌ జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌ – 65) పైకి వరద నీరు చేరింది. దీంతో ఎన్టీఆర్‌ జిల్లా నందిగామ మండలం ఐతవరం సమీపంలో జాతీయ రహదారిపై వరద నీరు ప్రవహిస్తుండటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

తొలుత ఐతవరం వద్ద పోలీసులు ట్రాఫిక్‌ క్రమబద్దీకరించి వాహనాల రాకపోకలను కొద్దిసేపు కొనసాగించారు. అయితే వరద ఉధృతి పెరగడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. వందలాది వాహనాలు జాతీయ రహదారిపై నిలిచిపోయాయి. దాదాపు రెండు కిలో మీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. ఇక వత్సవాయి మండలం లింగాల, పెనుగంచిప్రోలు మండల కేంద్రం సమీపంలో మున్నేటి కాజ్‌ వేపై వరద నీరు ప్రవహిస్తొంది. పెనుగంచిప్రోలు తిరుపతమ్మ అమ్మ వారి ఆలయ కేశ ఖండన శాల వరకూ వరద నీరు చేరుకుంది.

- Advertisement -

తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నందున మున్నేరు, వైరా ఏరు, కట్టలేరుకు వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. కంచికచర్ల మండలం కీసర వద్ద మున్నేరు, వైరా ఏరు, కట్టలేరు కలిసి ఉధృతంగా ప్రవహిస్తూ కృష్ణానదిలో కలుస్తొంది. మున్నేటికి లక్షా 40వేలకుపైగా క్యూసెక్కుల వరద నీరు చేరుతుండటంతో విజయవాడ ప్రకాశం బ్యారెజ్‌ వద్దకు వరద ప్రవాహం పెరుగుతోంది. ప్రస్తుతం అధికారులు లక్ష క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement