Saturday, November 23, 2024

Flood Warning – భద్రాచలం వద్ద 43 అడుగులకు చేరిన నీటిమట్టం – మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

భద్రాచలం: భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ఇవాళ ఉదయం 11 గంటలకు 41.3 అడుగులుగా ఉన్న నీటిమట్టం.. సాయంత్రం 3.30 గంటలకు 43 అడుగులకు చేరింది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసినట్లు జిల్లా కలెక్టర్‌ డా.ప్రియాంక అలా తెలిపారు. గోదావరి నుంచి 9,32,228 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు కలెక్టర్‌ పేర్కొన్నారు. మొదటి ప్రమాద హెచ్చరిక అమల్లో ఉన్నందున ముంపునకు గురయ్యే ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు జిల్లా యంత్రాంగపు సలహాలు, సూచనలు పాటించాలని కోరారు. అధికార యంత్రాంగం, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. ప్రజలు ఇళ్ల నుంచి బయటకి రావొద్దని హెచ్చరించారు. భారీగా కురిసిన వర్షానికి రామాలయం పరిసరాల్లోకి వర్షపు నీరు చేరడంతో భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. మరోవైపు అన్నదాన సత్రం వద్దకు వరద నీరు చేరడంతో అన్నదాన కార్యక్రమాన్ని నిలిపివేయాల్సిన పరిస్థితి నెలకొంది.

24 గంటల కంట్రోల్ రూములు
గోదావరి వరద ఉద్ధృతి నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ప్రియాంక. ఎప్పటికప్పుడు యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నారు. 24 గంటలు పనిచేసేలా కలెక్టరేట్‌తో పాటు కొత్తగూడెం, భద్రాచలం ఆర్డీవో కార్యాలయాలు.. చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం, బూర్గంపాడు, అశ్వాపురం, మణుగూరు, పినపాక తహసీల్దార్ కార్యాలయాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు చేశారు. భద్రాచలం వద్ద ఈ సాయంత్రానికి మొదటి ప్రమాద హెచ్చరిక వరకు జారీ చేసే అవకాశం ఉందన్నారు. ఏ ఒక్క ప్రాణానికి హాని కలగకుండా రక్షణ చర్యలు చేపట్టాలన్నారు. వరద నీరు చేరే వరకు ఆగకుండా.. ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు. పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయొద్దని ప్రజలకు సూచించారు. అవసరమైతే ప్రయాణాలు వాయిదా వేసుకోవాలన్నారు. జాలర్లు చేపల వేటకు వెళ్లొద్దని.. పశువులను మేతకు వదలకుండా ఇంటి వద్దే ఉంచాలని సూచించారు.

గోదావరి, ప్రాణహిత పరవళ్లు
మరోవైపు, తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాళేశ్వరం త్రివేణీ సంగమం వద్ద గోదావరి, ప్రాణహిత నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. తెలంగాణ, మహారాష్ట్రలోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ప్రాణహిత పరుగులు పెడుతోంది. ప్రస్తుతం కాళేశ్వరం వద్ద 9.980 మీటర్ల మేర నీటి మట్టం నమోదైంది. ఇది మరింత పెరగనుంది.

నిలిచిన బొగ్గు ఉత్పత్తి
ఇక, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుడంతో జన జీవనం అస్తవ్యస్తమైంది. తాడిచర్ల ఓపెన్ కాస్ట్‌ గనిలో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. కాటారం నుంచి మేడారానికి వెళ్లే రహదారి మధ్యలో కేశవాపూర్, పెగడపల్లి గ్రామాల మధ్య పెద్దవాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. నీటిమట్టం పెరుగుతున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పెద్దవాగు మీద నుంచి రాకపోకలను పోలీసులు నిలిపివేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement