ఢిల్లీ – గత కొన్నిరోజులుగా ఢిల్లీ సహా ఎగువన కురుస్తున్న వర్షాలకు యమునా నది మహోగ్రరూపం దాల్చింది. ప్రమాదక స్థాయిని మించి ప్రవహిస్తోంది. దీంతో ఢిల్లీని వరదలు చుట్టుముట్టాయి. ముఖ్యమంత్రి అధికార నివాసం, మంత్రుల ఇళ్లు, రాజ్ ఘాట్, అసెంబ్లీ, దేశ అత్యున్నత న్యాయస్థానం, ఎర్రకోట సహా అన్ని ప్రాంతాలకు వరద నీరు తాకింది. ప్రధాన రహదారులపై మోకాళ్ల లోతు నీరు నిలిచింది. దీంతో ఢిల్లీ మొత్తం మరో నదిలా మారిపోయింది..
అత్యంత రద్దీగా ఉండే ట్రాఫిక్ కూడలి అయిన ఢిల్లీలోని ఐటీఓ క్రాసింగ్ ప్రాంతం పూర్తిగా జలమయమైంది. దీంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరద నీరు నగరంలోకి చేరడంపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందిస్తూ,
యమునా నదిలో నీటి మట్టం పెరడంతో డ్రెయిన్ రెగ్యులేటర్ తెగిపోవడమే కారణమని వెల్లడించారు. వరద పరిస్థితులను పరిష్కరించేందుకు సైన్యం, విపత్తు సహాయక దళం సహాయం తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే సహాయ చర్యలలో పాల్గొనవలసిందిగా ఆయన స్వయంగా సైన్యాన్ని అభ్యర్ధించారు. ఈ నేపథ్యంలో దీంతో నేవీ, పదాతి దళాలు రంగంలోకి దిగాయి.. వరద ప్రాంతాలలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అలాగే నగరంలో వరద మరికొన్ని ప్రాంతాలకు విస్తరించకుండా చర్యలు ప్రారంభించారు.
తగ్గుముఖం పడుతున్నవరద
మరోవైపు యమునా నదిలో వరద ఉధృతి కొంత మేర తగ్గినట్లు అధికారులు తెలిపారు. గురువారం రాత్రి 208.66 మీటర్లు ఉన్న నీటి మట్టం.. శుక్రవారం ఉదయం 6 గంటలకు 208.46కు తగ్గింది. మధ్యాహ్నం సమయానికి 208 మీటర్లకు చేరింది.. వర్షాలు తగ్గడంతో వరద కూడా క్రమంగా తగ్గొచ్చని కేంద్ర జల సంఘం అంచనా వేసింది.