Friday, November 22, 2024

భద్రాద్రికి పొంచి ఉన్న వరద ముప్పు.. 51.70 అడుగులకు చేరిన నీటిమట్టం

భద్రాద్రి కొత్తగూడెం, ప్రభన్యూస్‌ ప్రతినిధి: గత ఐదు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జనజీవనం స్తంభించింది. ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నదితో పాటు దాని ఉప నదులైన కిన్నెరసాని, తాలిపేరు, పెదవాగు, ముర్రేడు ఇతర చిన్నచిన్న వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. గోదావరి ఎగువ ప్రాంతంలోని సాగు నీటి ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు చేరుతోంది. జలాశయాల నుంచి వరద నీటిని వదులుతుండటంతో భద్రాచలం వద్ద గోదావరి నది ఉగ్రరూపంతో ప్రవహిస్తోంది. గత నాలుగు రోజులుగా భద్రాచలం వద్ద పెరుగుతూ వస్తున్న గోదావరి నీటి మట్టం మూడో ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరుకుంది. సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు 53 అడుగులు దాటడంతో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అర్ధరాత్రి నుంచి నిలకడగా ఉంటున్న గోదావరి నీటిమట్టం మంగళవారం ఉదయం 8.35 గంటలకు 52.9అడుగులకు చేరుకోవడంతో భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. భద్రాచలం వద్ద పెరుగుతూ వస్తున్న గోదావరి నీటిమట్టం మంగళవారం ఉదయం స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. గోదావరి ఎగువ ప్రాంతాలలోని జలాశయాల నుంచి భారీగా వరద నీరు విడుదల చేస్తుండటంతో మంగళవారం రాత్రి నుంచి భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం మళ్లిd మూడో ప్రమాద హెచ్చరిక స్థాయి దాటి ప్రవహించే అవకాశాలు ఉన్నట్లు కేంద్ర జల వనరుల సంఘం అధికారులు అంచనా వేస్తున్నారు. గత నాలుగు రోజుల నుంచి పెరుగుతూ వస్తున్న గోదావరి నీటిమట్టం సోమవారం రాత్రి 11 గంటల వరకు 53. 90 అడుగులకు చేరుకుంది. మంగళవారం ఉదయం 8.30గంటల వరకు 52. 9 అడుగులకు చేరింది. దీంతో మూడో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. స్వల్పంగా పెరుగుతూ వస్తున్న గోదావరి నీటిమట్టం ఆదివారం రాత్రి 11.57 గంటలకు 43 అడుగులు దాటడంతో మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. సోమవారం ఉదయం 6.10గంటలకు 48 అడుగులకు చేరుకోవడంతో రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. సాయంత్రం 4 గంటలకు 53 అడుగులకు చేరుకోవడంతో మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి వరదతో భద్రాచలం నుంచి చర్ల, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో గల ఎటపాక, కూనవరం, వీఆర్‌పురం, చింతూర్‌ మండలాలకు రాకపోకలు స్తంభించాయి. ప్రధాన రహదారులపైకి 17 ప్రాంతాలలో గోదావరి వరద నీరు చేరడంతో ఎక్కడికక్కడే రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరి వరద వల్ల లోతట్టు ప్రాంతాలలోని పలు కాలనీలు జలమయం అయ్యాయి. గత ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో సింగరేణి ఓపెన్‌ కాస్ట్‌లలో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. ఉమ్మడి జిల్లాలోని కొత్తగూడెం, మణుగూరు, ఇల్లెందు, సత్తుపల్లి ఏరియాలలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోవడంతో సింగరేణికి కోట్లాది రూపాయల నష్టం వాటిల్లింది. గోదావరి వరదలతో ఎనిమిది ఇళ్లు పూర్తిగా దెబ్బతినగా 30 ఇళ్లకు పైగా పాక్షికంగా దెబ్బతిన్నాయి. వరద ముంపుకు గురైన వారి కోసం భద్రాచలం, చర్ల, దుమ్ముగూడెం, బూర్గంపాడు, అశ్వాపురం మండలాల్లో 19 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. సుమారు వెయ్యి మందిని పునరావాస కేంద్రాలకు తరలించి వారికి భోజనంతో పాటు అన్ని రకాల వసతులు ఏర్పాటు చేశారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ భద్రాచలంలోనే మకాం ఉండి గోదావరి వరద పరిస్థితిపై ఎప్పటికప్పుడు జిల్లా యంత్రాంగంతో సమీక్షిస్తున్నారు. పునరావాస కేంద్రాలకు తరలించిన వరద బాధిత కుటుంబాలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సకల సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement