(ఆంధ్రప్రభ న్యూస్ నెట్ వర్క్-తెలంగాణ) : నాగార్జున సాగర్ ప్రాజెక్టులోకి ఆదివారం కంటే అధికంగా నీరు వచ్చి చేరుతోంది. నాగార్జునసాగర్ ప్రాజెక్టులోకి 5,40,819 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. సోమవారం 4,94,843 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫో ఉండగా, 45843 క్యూసెక్కుల నీరు అధికంగా చేరుతోంది.
దీంతో అధికారులు అప్రమత్తమై 26 క్రస్ట్ గేట్లను ఎత్తి 5,04,748 క్యూసెక్కుల నీటిని వదిలిపెడుతున్నారు. 20 గేట్లను 15 ఫీట్ల మేర, 6 గేట్లను 10 ఫీట్ల మేర ఎత్తి నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 590 అడుగులకు గానూ, ప్రస్తుతం 587 అడుగులకు చేరుకుంది. 312.045 టీఎంసీల నీటి నిల్వకు గాను, ప్రస్తుతం ప్రాజెక్టు లో 305.5050 టీఎంసీల నీటి నిల్వ ఉందని అధికారులు తెలిపారు. ఎడమ కాలువకు రెండు చోట్ల గండి పడడంతో నీటి విడుదల నిలిపి వేశారు.
కుడి కాలువ ద్వారా 5,292 క్యూసెక్కులు, మెయిన్ పవర్ హౌస్ కు 28,379 క్యూసెక్కులు, ఎమ్మార్పీ ద్వారా 1800 క్యూసెక్కులు, ఎల్ఎల్సీ ద్వారా 600 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులోకి వస్తున్న నీటిని అలానే బయటకు విడిచిపెడుతున్నారు.
ఉధృతంగా మూసీ నది ప్రవాహం
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మూసి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 645 అడుగులకు గాను ప్రస్తుతం 641.53 అడుగుల నీరు ఉందని అధికారులు తెలిపారు. ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతం నుండి 7,549 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు అప్రమత్తమై ఆరు గేట్లను ఎత్తి దిగువకు 17, 052 క్యూసెక్కుల నీటిని విడిచి పెడుతున్నారు. ప్రాజెక్టు నీటి నిల్వలు 4.46 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 3.58 టీఎంసీలనిల్వ ఉందని ప్రాజెక్టు అధికారులు వెల్లడించారు.
జూరాలకు తగ్గిన ఇన్‌ఫ్లో
జోగులాంబ్ గద్వాల జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు నిన్నటి కంటే ఇన్‌ఫ్లో తగ్గింది. సోమవారం ప్రాజెక్టులోకి 3,35,000 క్యూసెక్కుల నీరు చేరుతోంది. నిన్న 3,82,000 క్యూసెక్కుల నీరు రికార్డయినసంగతి విదితమే. నిన్నటి కంటే ఈ రోజు 47,000 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లో తగ్గింది. ఆల్మట్టి, నారాయణపూర్ నుంచి భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్టు 45 గేట్లు ఎత్తి 3,00,825 క్యూసెక్కులు స్పిల్‌వే ద్వారా కిందకు విడిచిపెడుతున్నారు. విద్యుత్ ఉత్పత్తి కి 17,219 క్యూసెక్కులు, ఎడమ ప్రధాన కాలువ ద్వారా 290 క్యూసెక్కులు, కుడి ప్రధాన కాలువ ద్వారా 195 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. జూరాల పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా, ఇప్పుడు 317.490 మీటర్ల నీరు ఉంది. అదేవిధంగా ప్రాజెక్టులో 9.65 టీఎంసీల నీటి నిల్వకుగాను ప్రస్తుతం 8.415 టీఎంసీలు ఉంది. మొత్తం అవుట్‌ఫ్లో 3,18,574 క్యూసెక్కులు విడుదల చేస్తున్నామని, ఆవిరి రూపంలో 45 క్యూసెక్కుల నీరు పోతోందని అధికారులు తెలిపారు.
శ్రీరాంసాగర్ లోకి 2,51,000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతోంది. శ్రీరాంసాగర్ ఒక్కరోజులోనే పూర్తిస్థాయిలో నిండిపోయింది. ప్రాజెక్టులోకి 2 ,51,000 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. ఈ రోజు ఉదయం ఎనిమిది గేట్లను ఎత్తిన అధికారులు, సాయత్రం పూర్తిగా 40 గేట్లను ఎత్తివేశారు. ప్రాజెక్టు గేట్లు 42 ఉండగా, 40 గేట్ల ద్వారా 2,50,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడిచి పెడుతున్నారు. వరద కాలువ ద్వారా ఏడు వేల క్యూసెక్కులు, కాకతీయ కాలువ ద్వారా నాలుగు వేలు, ఎస్కేప్ గేట్ల ద్వారా మరో నాలుగు వేల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091అడుగులకు గాను ప్రస్తుతం 1088.9 అడుగులకు చేరుకుంది. ప్రాజెక్టు 80.5 టీఎంసీల సామర్థ్యానికి గాను 72.990 టీఎంసీలుగా వుంది.
నిజాంసాగర్ కి తగ్గిన ఇన్‌ఫ్లో
నిజాంసాగర్ ప్రాజెక్టులోకి వరద ఉధృతి తగ్గింది. ఉదయం వరకు 62 వేల క్యూసెక్కులకు పైగా వరద నీరు వచ్చి చేరగా, సాయంత్రానికి 51,000 క్యూసెక్కులకు తగ్గింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1405 అడుగులు, 17.802 టిఎంసి లు కాగా, ప్రస్తుతం ప్రాజెక్టులో నీటిమట్టం 1397.82 అడుగులతో 9.156 టీఎంసీల నీరు ఉంది వుంది. ఇదిలా వుంటే కామారెడ్డి జిల్లాలోని పోచారం, కల్యాణి ప్రాజెక్టులు కూడా పూర్తిగా నిండాయి. గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు.
కడెం ప్రాజెక్టు అన్ని గేట్ల ఎత్తివేత
కడెం ప్రాజెక్టు భారీగా వరదనీరు చేరుతోంది. దీంతో అధికారులు కడెం ప్రాజెక్టు మొత్తం 18 గేట్లను ఎత్తి, దిగువ గోదావరిలోకి నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు ఉండగా, ప్రస్తుతం నీటి నిల్వ 694.300 అడుగులకు చేరింది. ఇన్ ఫ్లో 1,94,039 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 2,49,054 క్యూసెక్కులు అని అధికారులు తెలిపారు.