పోలవరం, ప్రభ న్యూస్ : గోదావరికి మళ్లీ వరద పోటు మొదలైంది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతుండడంతో పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద వరద నీటిమట్టం పెరుగుతోంది. గత నెలలో తీరాన్ని వణికించిన గోదావరి వరద, క్రమేణా తగ్గుముఖం పట్టడంతో ముంపు గ్రామాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అయితే నదిలో వరద ప్రవాహం మాత్రం నిలకడగా ఉంది. ఇప్పుడు రెండు రోజులుగా తెలంగాణ ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వరద నీటిమట్టం భద్రాచలం వద్ద పెరుగుతూ వచ్చింది.
మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు 44 అడుగులుగా నమోదైంది. దీంతో పోలవరం ప్రాజెక్టు ఎగువ స్పిల్ వే వద్ద 32. 14 అడుగులు నమోదైంది. ప్రస్తుతం గోదావరిలో 10 లక్షల క్యూసెక్కుల వరద నీరు ప్రవహిస్తోంది. గోదావరి వరద నీరు పెరుగుతుండడంతో వేలేరుపాడు, కుకునూరు, పోలవరం మండలాల్లో గోదావరి తీర ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.