జపాన్ రాజధాని టోక్యోలోని ఓ ప్రధాన విమానాశ్రయంలో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. రన్‌వేపై రెండు కమర్షియల్ విమానాలు ప్రమాదవశాత్తూ ఒకదాన్నొకటి తాకాయి. హనేడా ఎయిర్‌పోర్టులో శనివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. బ్యాంకాక్ బయల్దేరిన థాయ్ ఎయిర్‌వేస్ ఇంటర్నేషనల్ విమానం.. తైపీకి బయల్దేరిన ఇవా ఎయిర్‌వేస్ విమానం రన్‌వేపై ఒకేసారి వచ్చి ఒకదాన్నొకటి తాకాయి. పైలట్లు వెంటనే అప్రమత్తమై విమానాలను నిలిపివేశారు.ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదని అధికారులు వెల్లడించారు.
ఒకే రన్‌వేపై రెండు విమానాలు నిలిపిన దృశ్యాలు సామాజిక మాధ్య
మాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. అయితే ఓ విమానం రెక్క స్వల్పంగా దెబ్బతింది. ఆ వింగ్ భాగాలు రన్‌వేపై పడ్డాయి. కాగా.. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. రెండు విమానాలను ఒకేసారి రన్‌వేపైకి ఎలా అనుమతించారన్నదానిపై స్పష్టత లేదు. ఈ విమానాశ్రయంలో నాలుగు రన్‌వేలు ఉన్నాయి. ప్రస్తుతానికి ఘటన జరిగిన రన్‌వేను తాత్కాలికంగా మూసివేశారు. దీంతో కొన్ని విమానాల రాకపోకలు ఆలస్యమైనట్లు అధికారులు తెలిపారు.